అక్షరటుడే, వెబ్‌డెస్క్: Curry Puff | ఈ రోజుల్లో చాలా మంది ఆహారం విషయంలో చాలా హైజనిక్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా షాపులకు వెళ్లినప్పుడు ఒకటికి పది సార్లు చూసుకొని మరీ తింటున్నారు. తాజాగా ఓ మహిళ తింటున్న ఆహారంలో విషపూరిత జీవి ప్రత్యక్షమవడంతో ఆమె ఉలిక్కిపడింది.
ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళ్తే.. జడ్చర్ల కొత్త బస్టాండ్ (Jadcharla New Bus Stand) సమీపంలోని పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బేకరీకి శ్రీశైలమ్మ అనే మహిళ వెళ్లి కర్రీ పఫ్ (Curry Puff) కొనుగోలు చేసింది. ఇంటికి వచ్చి తినడం ప్రారంభించగానే ఆమె షాక్‌కు గురయ్యింది.
Curry Puff | పాము పిల్ల ప్రత్యక్షం..
ఎందుకంటే ఆ పఫ్‌లో కర్రీ ఉండాల్సిన చోట పాముపిల్ల కనిపించింది. ఆమె ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. ఇది చూసిన ఆమె కుటుంబసభ్యులు, స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే ఆమె అదే పఫ్ తీసుకొని మళ్లీ బేకరీకి వెళ్లి యజమానిని ప్రశ్నించింది. అయితే అతను సరైన సమాధానం ఇవ్వకుండా, నేరుగా షాపు మూసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనను సీరియస్‌గా తీసుకొని, సంబంధిత బేకరీ యజమానిపై (Bakery Owner) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బేకరీ శానిటేషన్, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. స్థానిక పౌరులు కూడా ఆ బేకరీపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో బేకరీలో ఎలాంటి నాణ్యతలు పాటిస్తున్నారన్నది అర్ధం అవుతుంది. ఇలాంటి ఘోర ఘటనలు చూసిన వారు అసహనం వ్యక్తం చేస్తూ వారి సంపాదన కోసం మన ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నామా అని మండిపడుతున్నారు. ఆహార నిబంధనలు పాటించని షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి ఫుడ్ సేఫ్టీ శాఖ (Food Safety Department) చేతకానితనాన్ని ప్రశ్నిస్తోంది. అనుమతులు లేకుండా నడుస్తున్న, పరిశుభ్రతను పట్టించుకోని బేకరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.