అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chief Justice Gavai | ఢిల్లీ-ఎన్‌సీఆర్ వీధుల్లో వీధికుక్కల నిషేధం విధింపుపై పునఃపరిశీలన చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice Gavai) హామీ ఇచ్చారు. ఢిల్లీలో కుక్కలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
నాలుగు వారాల్లో వాటన్నింటినీ తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. కుక్క కాటుతో పాటు రేబిస్ కేసులు (Rabies cases) పెరుగుతున్న దృష్ట్యా, నివాస ప్రాంతాల నుంచి అన్ని వీధికుక్కలను ఆశ్రయాలకు తరలించాలని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఆదేశించింది. కోర్టు తీర్పుపై సమాజంలోని అనేక వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మూడు లక్షల కుక్కలు ఉంటాయని, వాటిని తరలించడానికి, సంరక్షించడానికి సరిపడా వసతులు లేవని అధికార వర్గాలు పేర్కొంటుండగా, లక్షలాది శునకాలను ఢిల్లీ నుంచి నిషేధించడంపై జంతు ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాన్ని బుధవారం ప్రధాన న్యాయమూర్తి ముందు పలువురు లేవనెత్తారు. వీధికుక్కలను (Street Dogs) తరలించడం, చంపడాన్ని నిషేధించి, వీధికుక్కల కోసం ఉన్న చట్టాలు, నియమాలను పాటించాలని ఆదేశించిన మునుపటి కోర్టు ఉత్తర్వు గురించి సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన బీఆర్ గవాయ్.. తాజా తీర్పును పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ వీధుల నుంచి కుక్కలను తరలించాల్సిన అవసరంపై ఉన్నత న్యాయస్థానంతో విభేదించిన వేలాది మంది జంతు ప్రేమికుల ఆందోళనలను గుర్తించిన ఆయన.. “నేను దీనిని పరిశీలిస్తాను” అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.