అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harbhajan Singh | ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్దనే డిమాండ్ మరింత ఊపందుకుంటోంది. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న అభిప్రాయం వెల్లువెత్తోంది. ఇప్పటికే 2025 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో (WCL) భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. పాకిస్తాన్‌తో ఆడడానికి మన ఆటగాళ్లు నిరాకరించడంతో వచ్చే ఆసియా కప్‌కు కూడా ఉండాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇండో-పాక్ క్రికెట్‌ను బహిష్కరించాలని వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటించారు. శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి వారు (WCL)లో పాకిస్థాన్‌తో ఆడడానికి నిరాకరించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఆసియా కప్ 2025(Asia Cup 2025) షెడ్యూల్ వెలువడింది. ఒకే గ్రూప్‌లో ఉన్న ఇండియా పాకిస్తాన్ సెప్టెంబర్ 14న తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే హర్భజన్ BCCI వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Harbhajan Singh | క్రికెట్ ముఖ్యమం కాదు..
పాకిస్తాన్ (Pakistan) నుంచి దేశాన్ని రక్షించడానికి మన సైనికులు ఓవైపు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఆ దేశంతో క్రికెట్ ఆడడంలో అర్ధం లేదని మాజీ ఆఫ్ స్పిన్నర్ సింగ్ పేర్కొన్నాడు. “ఏది ముఖ్యమోది, ఏది కాదో అనేది బీసీసీఐ (BCCI) అర్థం చేసుకోవాలి. ఇది అంత సులభం. మన సైనికులు కుటుంబాలకు దూరంగా ఉంటూ సరిహద్దులో కాపలాగా నిలబడ్డారు. ఈ క్రమంలో కొన్నిసార్లు తన ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. వారి త్యాగం మనందరికీ చాలా గొప్పది. దాంతో పోలిస్తే, ఇది (క్రికెట్) చాలా చిన్న విషయం, మనం ఒక్క క్రికెట్ మ్యాచ్ ఆడకుండా ఉండలేమా? ” అని హర్భజన్ వ్యాఖ్యానించాడు.
ప్రభుత్వం కూడా స్పష్టమైన వైఖరితో ఉందని ఈ సందర్భంగా అతడు గుర్తు చేశాడు. నీళ్లు రక్తం కలిసి పారలేవన్నదే ప్రభుత్వ విధానమని తెలిపారు. “ప్రభుత్వం కూడా ‘ఖూన్ ఔర్ పానీ ఏక్ సాథ్ నహీ బెహ్ సక్తే’ (రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు) అనే వైఖరినే కలిగి ఉంది. సరిహద్దులో పోరాటం, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు క్రికెట్ (Cricket) ఆడడానికి వెళ్లకూడదు. పెద్ద సమస్యలు పరిష్కారమయ్యే వరకు క్రికెట్ ఆడకపోవమే మంచిది. క్రికెట్ చాలా చిన్న విషయం. దేశమే అన్నింటికే ప్రధానం.” అని ఆయన పేర్కొన్నాడు.
Harbhajan Singh | దేశమే మన గుర్తింపు..
మనం క్రికెటర్ అయినా, నటుడు అయినా ముందుకు మనకు గుర్తింపు వచ్చేది దేశం తరఫున మాత్రమేనని హర్భజన్ తెలిపాడు. “మన గుర్తింపు ఏదైనా, దానికి కారణం ఈ దేశం. మీరు ఆటగాడైనా, నటుడైనా, లేదా మరెవరైనా, దేశం కంటే ఎవరూ పెద్దవారు కాదు. దేశమే ముందు. దానికి మనం చేయాల్సిన విధులను నెరవేర్చాలి. క్రికెట్ మ్యాచ్ నా ఖేల్నా బహుత్ మాములి సి చీజ్ హై దేశ్ కే సామ్నే (దేశం ప్రాముఖ్యతతో పోలిస్తే క్రికెట్ మ్యాచ్ ఆడకపోవడం ఏమీ కాదు)” అని 400 కంటే ఎక్కువ టెస్ట్ వికెట్లు తీసిన భారత మాజీ స్పిన్నర్ అన్నారు.