అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Suresh Raina | భారత క్రికెట్ మాజీ స్టార్ ప్లేయర్ సురేశ్ రైనాకి (Suresh Raina) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ‘1xBET’ కేసులో విచారణ నిమిత్తం ఈరోజు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే, ‘1xBET’ అనే బెట్టింగ్ యాప్‌కు సురేశ్ రైనా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారని సమాచారం.
ఈ యాప్ ద్వారా కోట్లాది రూపాయల ప్రజలను మోసం చేయడంతో పాటు, భారీ స్థాయిలో పన్ను ఎగవేత జరగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కింద ఈడీ కేసు నమోదు (ED registered Case) చేసి దర్యాప్తు చేపట్టింది.
Suresh Raina | చిక్కుల్లో రైనా..
ఈ వ్యవహారంలో రైనాకు ఈడీ నుంచి వచ్చిన పిలుపు క్రీడా ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. యాప్ ప్రమోషన్‌లో (App Promotions) భాగంగా రైనాకు చెల్లించబడిన మొత్తాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టిసారించనుంది. ఈ కేసులో సురేశ్ రైనాతో పాటు మరికొందరు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు (Bollywood celebrities) కూడా ఈడీ విచారణలో ఉన్నట్లు సమాచారం. యాప్ నిర్వాహకులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా ప్రచారం నిర్వహించడంతో, పలువురు ప్రముఖులు ప్రమోషన్లలో భాగం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ విచారణ తర్వాత రైనా ఏమైనా స్పందిస్తాడా అనేది చూడాలి.
38 ఏళ్ల సురేశ్ రైనా, భారత జాతీయ జట్టు తరఫున 18 టెస్టులు, 221 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించారు. అలాగే, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున కీలకంగా రాణించి.. ‘మిస్టర్ ఐపీఎల్’ అనే గుర్తింపు పొందారు. ఒకప్పుడు అభిమానుల మన్ననలు పొందిన ఈ స్టార్ ప్లేయర్ ప్రస్తుతం విచారణకు హాజరుకావడం ఆయన ఫ్యాన్స్‌కు కాస్త నిరాశని కలిగిస్తుంది. రైనా ప్రస్తుతం క్రికెట్‌కి దూరంగా ఉన్నా కూడా కామెంట్రీతో అలరిస్తూనే ఉన్నాడు.