అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagarjuna Sagar | నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా నీరు వచ్చి చేరుతోంది. 2.11 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో 24 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా ఉండడంతో 2,33,051 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులు (309.95 టీఎంసీలు)గా ఉంది. కృష్ణమ పోటెత్తుండడంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ వరద నాగార్జునసాగర్(Nagarjuna Sagar)కు వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar | శ్రీరాంసాగర్‌కు స్వల్పంగానే..
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)కు స్వల్పంగానే వరద వస్తోంది. బుధవారం ఉదయం 12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1080 అడుగులు (44.937 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ప్రాజెక్టుకు పెద్దగా వరద రాలేదు. ఎగువ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో భారీవర్షాలు కురియక పోవడంతో గోదావరి బోసిపోయింది.
Nagarjuna Sagar | మేడిగడ్డకు భారీ వరద
ఎగువ గోదావరి వెలవెలబోతుండగా, దిగువ గోదావరి మాత్రం కొత్త నీటితో ఉరకలెత్తుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కు భారీగా వరద(Heavy Flood) వస్తోంది. అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్‌కు లక్ష క్యూసెక్కులపైగా ఇన్‌ఫ్లో వచ్చింది. అయితే బ్యారేజ్ కుంగిపోవడంతో గేట్లన్నంటినీ తెరిచి ఉంచారు. మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.