అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్‌లో జరుగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు (Tariffs) పెంచిన తర్వాత ప్రధాని అమెరికా (America) వెళ్తుండడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. తన పర్యటనలో ప్రధాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుతో (US President Donald Trump) సమావేశమమై టారిఫ్‌లపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు పలువురు నేతలతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముందని పేర్కొన్నాయి.
PM Modi | 26న మోదీ ప్రసంగం
80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (United Nations General Assembly session) సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. 23-29 వరకు ఉన్నత స్థాయి జనరల్ డిబేట్ జరుగుతుంది. ఉన్నత స్థాయి చర్చకు వక్తల తాత్కాలిక జాబితాను తాజాగా విడుదల చేశారు. దాని ప్రకారం భారత ప్రభుత్వాధినేత సెప్టెంబర్ 26 ఉదయం ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. అలాగే చైనా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్ అధిపతులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 23న ప్రసంగించనున్నారు. ఇది తాత్కాలిక జాబితా మాత్రమే. రానున్న రోజుల్లో షెడ్యూల్ మారవచ్చు.
PM Modi | ప్రధాని పర్యటనపై ఆసక్తి..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విధించిన సుంకాలతో భారత్-అమెరికా (India-America) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. రష్యా నుంచి చౌకగా చమురు కొంటున్నారనే అక్కసుతో ట్రంప్ రెండు విడుతల్లో కలిపి 50 శాతం టారిఫ్ విధించారు. మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ట్రంప్ విధించిన సుంకాలను ఇండియా (india) తీవ్రంగా విమర్శించింది. అమెరికా నిర్ణయం అన్యాయమైనది, అసమంజసమైనదని పేర్కొంది. జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు, రైతుల విషయంలో రాజీ పడేది లేదని, అందుకు వ్యక్తిగతంగా తాను మూల్యం చెల్లించడానికైనా సిద్ధమన్న ప్రధాని మోదీ పరోక్షంగా అమెరికా పన్నులకు లెక్క చేయబోమని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో మోదీ అమెరికా పర్యటన ఆసక్తికరంగా మారింది.