అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan PM Sharif | పాకిస్తాన్ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. సిందూ జలాలు (Indus Water) నిలిపివేయడాన్ని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (PM Shehbaz Sharif) తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి హక్కుగా చెందిన ఒక్క చుక్క నీటిని కూడా ఇండియాను తీసుకోనివ్వమని ప్రతిజ్ఞ చేశారు. తమ నీటిని తీసుకుంటే మరోసారి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పాక్ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తూ కావాలనే రెండు అణ్వాయుధ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నారు. తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని, అణుబాంబులు ప్రయోగిస్తామని, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Pakistan Army Chief Asim Munir) ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం మరువక ముందే ఆ దేశ ప్రధాని నుంచి తాజా వ్యాఖ్యలు రావడం గమనార్హం.
Pakistan PM Sharif | ఒక్క చుక్క నీటినీ వదులుకోం..
తమ దేశానికి హక్కుగా చెందిన ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మీరు మా నీటిని మళ్లిస్తామని బెదిరిస్తున్నారు. కానీ మీరు పాకిస్తాన్ (Pakistan) నుంచి ఒక్క చుక్కను కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి” అని పేర్కొన్నారు.
భారతదేశం (India) అలాంటి చర్యకు ప్రయత్నిస్తే, “మీకు మళ్లీ అలాంటి గుణపాఠం నేర్పుతారు, మీరు మీ చెవులు పట్టుకుని ఉండాల్సి వస్తుంది” అని కవ్వింపులకు పాల్పడ్డారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో (Pahalgam terror Attack) 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఒక రోజు తర్వాత సింధు నది ఒప్పందాన్ని ఇండియా రద్దు నిలిపివేసింది. సిందూ నీటిని ఆపడానికి ఏదైనా జోక్యం చేసుకుంటే యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ అంటుంది. అయితే భారత్ మాత్రం చుక్క నీటిని వదిలేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.
సిందూ జలాల నిలిపివేతపై పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Butto) కూడా రెండ్రోజుల క్రితం నోరు పారేసుకున్నారు. ఈ నిర్ణయం సింధు లోయ నాగరికతపై దాడిగా అభివర్ణించారు. భారత్ యుద్ధాన్ని కోరుకుంటోందని ఆరోపించారు. మరోవైపు, సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంపై అసిమ్ మునీర్ కూడా పిచ్చి ప్రేలాపనలు చేశారు. సిందూ నది మీద భారత్ ఆనకట్టలు నిర్మిస్తే వాటిని క్షిపణులతో పేల్చి వేస్తామని హెచ్చరించారు. “సిందూ నది (Indus River) భారతీయుల కుటుంబ ఆస్తి కాదు. నదిపై భారతదేశం ఆనకట్ట నిర్మించే వరకు వేచి ఉంటాము. అవి పూర్తయిన తర్వాత మేము వాటిని పేల్చేస్తాం. మా వద్ద క్షిపణులకు కొరత లేదని” పేర్కొన్నారు.