అక్షరటుడే, ఆర్మూర్ : Jeevan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) పాలనలో రాష్ట్రంలోని రైతులు (Farmers) కంటతడి పెడుతున్నారని బీఆర్ఎస్ (BRS) జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Former MLA Jeevan Reddy) అన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత నెలకొనడంతో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు మొదలయ్యాయన్నారు. ఎరువుల కోసం చెప్పులు, పాసుబుక్ జిరాక్స్ పేపర్లు లైన్లో పెట్టి పడిగాపులుకాసే పాడు రోజులు మళ్లీ వచ్చాయన్నారు. పంటలకు యూరియా (Urea) వేయాల్సిన సమయంలో అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రోజంతా సొసైటీల వద్ద పడిగాపులు కాసినా.. ఒకటి రెండు సంచులకు మించి యూరియా ఇవ్వడం లేదన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. అరకొర ఎరువుల సరఫరా రైతుల అవసరాలను తీర్చలేక పోతోందని, వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందని ఆయన మండిపడ్డారు. ఒకవైపు ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులు రోడ్లు ఎక్కుతుంటే మరోవైపు అసలు కొరతే లేదని యంత్రాంగం చెబుతుండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
Jeevan Reddy | రైతు వ్యతిరేక ప్రభుత్వం
కాంగ్రెస్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని జీవన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాలనలో ఇప్పటికే వెయ్యి మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతుబీమా సొమ్ము కూడా రాక వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇంకా రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని, ఒక్క ఆర్మూర్ (Armoor) నియోజకవర్గంలోనే రుణమాఫీ కాని రైతులు ఇంకా 30 వేల మంది ఉన్నారని వెల్లడించారు.