అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector Nizamabad | రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆయన పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (CP Sai chaitanya) కలిసి మంగళవారం జిల్లా పరిధిలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మాక్లూర్(makloor) మండలం మానిక్ భండార్ (manikbandar) చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు గల కారణాల గురించి జాతీయ రహదారుల సంస్థ, పోలీస్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్, సీపీలు చర్చించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారులపై బ్లాక్స్పాట్లుగా (Blackspots) గుర్తించిన ప్రదేశాల్లో ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆర్టీసీ (RTC) బస్ డ్రైవర్లు సహా, ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించేలా ట్రాఫిక్ నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాల్లోనూ ముఖ్య కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బ్లాక్ స్పాట్లను పరిశీలించిన అధికారుల బృందంలో జాతీయ రహదారుల సంస్థ ఈఈ మలారెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ అజయ్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ రావ్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, హర్ష, 108 ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధి రామలింగేశ్వర రెడ్డి తదితరులున్నారు.