అక్షరటుడే, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను (TG SSC Exams) పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ (Telangana Education Department) ప్రకటించింది. ఇంటర్నల్ మార్కుల (internal marks) (20 శాతం) విధానం కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 80 శాతం ఎక్స్ టర్నల్ మార్కులు (external marks) ఉంటాయని తెలిపింది.
SSC exams : సందిగ్ధానికి ఫుల్స్టాప్..
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉంటాయా.. ఉండవా.. అనే సందేహాలపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందా..? అని తెలంగాణలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూశారు.
SSC exams : గతేడాది నవంబరులో..
ఇంటర్నల్ మార్కులను సర్కారు ఇంతకు ముందు తొలగించింది. ఈ మేరకు గతేడాది నవంబరులో సర్కారు జీవో కూడా జారీ చేసింది. కాగా.. ఇటీవల ఢిల్లీలో శిక్షణ మండలి (NCERT), జాతీయ విద్యా పరిశోధన వర్క్ షాప్ నిర్వహించింది. ఇందులో తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సందేహాలు వెలువడ్డాయి. వర్క్ షాప్లో నిపుణులు అడిగిన ప్రశ్నలకు మనవారు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో పాఠశాల విద్యాశాఖ పునరాలోచనలో పడింది. సమగ్ర చర్చ అనంతరం పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది.