అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఎక్కడా లేని వింత వింత మోసాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో (Uttar Pradesh) వెలుగుచూస్తున్నాయి. మొన్న నకిలీ రాయబార కార్యాలయం (fake embassy) బయటపడగా.. తాజాగా నకిలీ పోలీస్ స్టేషన్ వెలుగు చూసింది. నకిలీ ఐడీ కార్డులు, ధ్రువపత్రాలతో పోలీసుల అవతారమెత్తారు కేటుగాళ్లు. ఆరుగుగు ఉన్న ఈ ముఠా ఎట్టకేలకు ఒరిజినల్ పోలీసులకు చిక్కింది.
నోయిడాలోని (Noida) సెక్టార్ 70లో ఈ ఘటన వెలుగుచూసింది. ‘ఇంటర్నేషనల్ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ పేరుతో ఓ కార్యాలయం ఓపెన్ అయింది. కార్యాలయం బయట బోర్డులు పెట్టారు. నిజమైన పోలీస్ స్టేషన్ మాదిరిగా అన్ని హంగులు సమకూర్చారు.
Fake Police Station : సమాచారం అందడంతో..
ఫేక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన పది రోజులకు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏమిటీ కార్యాలయం అంటూ అసలైన పోలీసులు తనిఖీలకు వచ్చారు. ఫేక్ పోలీస్ స్టేషన్లో సోదాలు చేపట్టారు. వీరి తనిఖీలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగుచూశాయి.
Fake Police Station : ఎన్నో రకాలు..
ఫేక్ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సెల్ఫోన్లు, చెక్ బుక్స్, రబ్బర్ స్టాంప్స్, ఏటీఎం కార్డ్స్, లెటర్ ప్యాడ్స్, ఐడీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.
వీటికితోడు.. పలు కేంద్ర మంత్రిత్వ శాఖల ఫోర్జరీ ధ్రువపత్రాలు, పోలీసు డిపార్టుమెంట్ లోగోలు, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్, ఇంటర్‌పోల్ లాంటి సంస్థలతో అనుసంధానమైనట్లు ఉన్న ధ్రువపత్రాలు, అధికారిక స్టాంపులు వెలుగు చూడడంతో పోలీసులు షాక్ అయ్యారు.
వీటికితోడు బ్రిటన్‌లో కూడా తమకు కార్యాలయం ఉందని వారు పేర్కొనడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రభుత్వ అధికారులుగా పేర్కొంటూ.. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా విరాళాలను సైతం సేకరించినట్లు విచారణలో తేలింది. ఆరంభంలోనే ఈ నకిఖీ పోలీసు ముఠా గుట్టురట్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. వీరి బారిన పడిన బాధితులను గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.
రూ. 300 కోట్ల కుంభకోణం..
గజియాబాద్‌లో కొన్ని రోజుల కిందటే ఓ నకిలీ రాయబార కార్యాలయం వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడు హర్షవర్ధన్ జైన్ రూ.300 కోట్ల కుంభకోణం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతగాడికి విదేశాల్లో పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తేలింది. గత పదేళ్లలో హర్షవర్ధన్ 162 సార్లు విదేశీ పర్యటనలు చేసినట్లు వెల్లడైంది.