అక్షరటుడే, నిజాంసాగర్: MLA Lakshmi Kantharao | విద్యార్థుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి బంగారు తెలంగాణకు పెట్టుబడి లాంటిదేనని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantharao) అన్నారు. పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను సోమవారం సందర్శించారు.
పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి ప్రిన్సిపాల్, సిబ్బందితో (principal and staff) చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందించాలని సూచించారు.
విద్యార్థుల (students) భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తోందని, దీనిలో భాగంగా విద్యార్థులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా.. రేపటి బంగారు తెలంగాణకు (Telangana) పెట్టుబడి లాంటిదని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యకు రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు.
అలాగే విద్యా వ్యవస్థలో (education system) మార్పుకు శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో విద్యా కమిషన్ ఏర్పాటు, అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చడం, గురుకుల విద్యార్థులకు (Gurukul students) మెస్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచడం జరిగిందని వివరించారు. కేవలం వసతులు కల్పించడమే కాదు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో మెగా డీఎస్సీ (Mega DSC) ద్వారా రాష్ట్రంలో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు.
అలాగే పారదర్శకంగా టీచర్స్ బదిలీలను కూడా నిర్వహించి విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. గతంలో చాలీచాలని బడ్జెట్‌తో విద్యార్థులకు మెనూ ప్రకారం సరైన భోజనం అందించలేదన్నారు. అరటి పండు ఇస్తే గుడ్డు ఇవ్వలేదు, గుడ్డు ఇస్తే పాలు ఇవ్వలేదు ఇలా ఏదో ఒక రకంగా మెనూలో కోత విధించేవారన్నారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి ఆకలి కడుపుతో విద్యార్థుల ఎదుగుదలకు, చదువుకు నష్టం వాటిల్లుతుందని.. మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను పెంచారని చెప్పారు.