అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | చనిపోయిన తండ్రి ఫొటో ముందు దీపం వెలిగించగా మంటలు వ్యాపించాయి. దీంతో తల్లి తనను కొడుడుతుందేమోనన్న భయంతో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన రామారెడ్డి మండలం (Ramareddy mandal) స్కూల్ తండాలో ఆదివారం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతని ఫొటో ముందు ప్రతిరోజూ కుటుంబ సభ్యులు దీపం వెలిగిస్తుంటారు.
అయితే ఆదివారం పదేళ్ల కూతురు.. తండ్రి ఫొటో ముందు దీపం వెలిగించింది. ఆ సమయంలో దీపం పక్కనే ఉన్న టవల్కు మంటలు అంటుకుని ఆ మంటలు ఫొటోకు వ్యాపించాయి. దీంతో తండ్రి ఫొటో (father photo) కాలిపోయింది. అయితే తండ్రి ఫొటో కాలిపోయినందుకు తల్లి కొడుతుందేమోనన్న భయంతో ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. గమనించిన తల్లి చుట్టుపక్కల వారికి విషయం చెప్పి వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.