అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | చిన్న వాన పడితే హైదరాబాద్ నగరం (Hyderabad City) ఆగం అవుతుంది. అదే భారీ వర్షం (Heavy Rain) కురిస్తే నగర వాసులు నరకయాతన అనుభవిస్తారు. మహా నగరంలో నాలుగు రోజులుగా నిత్యం వర్షం పడుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లోతట్టు ప్రాంతాల్లోకి నీరు రావడంతో ఆయా కాలనీ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇక రోడ్లపై నీరు చేరి చెరువులను తలపిస్తుండడంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు గంటల కొద్ది రోడ్లపై నిరీక్షిస్తున్నారు. సోమవారం సైతం నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
Hyderabad | ముందుగా బయలుదేరండి
నగరంలోని చాలా కార్యాలయాలు సాయంత్రం ఐదు గంటల తర్వాత క్లోజ్ అవుతాయి. పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు సైతం అదే సమయంలో ఇళ్లకు బయలు దేరుతారు. దీంతో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో వర్షం పడితే ఇళ్లకు చేరడానికి గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సిందే. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కూడా వర్ష సూచన ఉండడంతో కార్యాలయాలు తమ ఉద్యోగులను ముందుగా ఇళ్లకు పంపించాలని ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) కోరారు. ఈ మేరకు ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం 3 గంటలకే తమ ఉద్యోగులు లాగౌట్ చేసేలా ఆయా సంస్థలు చర్యలు చేపట్టాలని కోరారు.
ఉద్యోగులు ముందుగా లాగౌట్ అయి ఇళ్లకు బయలు దేరితే ట్రాఫిక్ సమస్య తలెత్తదని పోలీసులు పేర్కొన్నారు. 3 గంటల నుంచి లాగౌట్ చేస్తే వాహనాల రద్దీ అధికంగా ఉండదన్నారు. నగరవాసులు సైతం సాయంత్రం పూట బయటకు రావొద్దని కోరారు. అత్యవసరం (Emergency) అయితే తప్ప ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టొద్దని సూచించారు.