అక్షరటుడే, వెబ్‌డెస్క్: Akash deep | ఇంగ్లండ్(England)తో జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను (Ben Ducket) ఔట్ చేసిన అనంతరం అతని భుజంపై చెయ్యివేసి ఏదో చెబుతూ సెలబ్రేట్ చేయడం విమర్శలకు దారితీసింది. భారత మాజీ క్రికెటర్లతో పాటు, అంతర్జాతీయ క్రికెటర్లూ ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేశారు. అలా చేయడం సరికాదని కామెంట్స్ చేశారు. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) అయితే, “అక్కడ బెన్ స్టోక్స్ ఉండి ఉంటే, ఆకాష్ దీప్ చెంపలు వాయించేవాడు” అంటూ ఘాటుగా స్పందించాడు.
Akasheep | ఇది కారణం..
విమర్శల నేపథ్యంలో ఆకాష్ దీప్ (akash deep) స్పందిస్తూ , అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. బెన్ డకెట్ (Ben Duckett) నన్ను ప్రొవోక్ చేశాడు. అతనిపై నాకు మంచి రికార్డ్ ఉంది. అతన్ని నేను గతంలో కూడా చాలా సార్లు ఔట్ చేశాను. ఆ మ్యాచ్‌లో అతను వినూత్న షాట్లు ఆడుతూ, నా లైన్ అండ్ లెంగ్త్‌ను చెడగొట్టే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అతను నాతో మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాది.. నువ్వు నన్ను ఔట్ చేయలేవ్’ అని అన్నాడు. దాంతో అతన్ని ఔట్ చేసిన తర్వాత నవ్వుతూ.. ‘నీవు మిస్ చేస్తే.. నేను హిట్ చేస్తాను. ప్రతిసారి నీవే గెలవలేవ్.. ఈసారి నేను గెలిచాను’ అని అన్నాను. నేను అతనితో సరదాగానే మాట్లాడాను. ఎలాంటి విభేదాలు లేవు అంటూ ఆకాశ్ దీప్ క్లారిటీ ఇచ్చాడు.
ఆకాష్ దీప్ తన చర్య వెనక ఉన్న కారణాన్ని వివరించినా, అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్ల మధ్య గౌరవం ఉండాలన్న విషయాన్ని మరచిపోవద్దంటూ కొందరు చురకలు అంటిస్తున్నారు. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్ 2-2తో సమం అయిన విషయం తెలిసిందే. ఆకాష్ దీప్ ఈ సిరీస్‌లో తక్కువ మ్యాచ్‌లే ఆడినప్పటికీ, తన పేస్‌తో ఆకట్టుకున్నాడు. చివరి మ్యాచ్‌లో నైట్ వాచ్‌మెన్‌గా వచ్చి బ్యాటింగ్‌తోను ఆకట్టుకున్నాడు. గట్టిగా ప్రయత్నిస్తే ఆకాశ్ దీప్ మంచి ఆల్‌రౌండర్‌గా (All Rounder) ఎదిగే అవకాశం ఉందని అంటున్నారు.