అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గురువారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో గచ్చిబౌలిలో (Gachibowli) పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మల్కం చెరువు పరిసరాల్లో వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner) రంగనాథ్ శుక్రవారం ఉదయం వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. వరద ముంచెత్తడానికి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడానికి కారణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు.
రాయదుర్గం వద్ద గల మల్కం చెరువుకు వరద ఎక్కువ మొత్తంలో వచ్చింది. అదే సమయంలో బయటకు వెళ్లే వరద ఆ స్థాయిలో లేకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అలుగు పారడం ద్వారా మాత్రమే నీరు బయటకు వెళ్తోందని.. స్లూయిజ్ గేట్లు కూడా ఏర్పాటు చేస్తే.. వర్షాకాలంలో నీటిమట్టాన్ని తగ్గించడానికి వీలు అవుతుందని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పుడు వెంటనే ఈ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. చెరువు (Malkam Lake) పరిసరాల్లో రహదారులే కాకుండా.. నివాసాలు కూడా నీట మునుగుతున్నాయని.. వెంటనే ఈ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.
Hydraa | వరద చెరువులోకి చేరేలా చర్యలు
మల్కం చెరువు చుట్టూ వరద నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రంగనాథ్ పలు సూచనలు చేశారు. బయోడైవర్సిటీ పార్కు, షేక్‌పేట ప్రాంతాల నుంచి వచ్చిన వరద చెరువు వద్ద గల వంతెన దగ్గర నిలిచిపోతుంది. ఈ నీరు చెరువులోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
Hydraa | సహాయక చర్యల పర్యవేక్షణ
హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం (Heavy Rains) కురిసింది. గచ్చిబౌలి పరిసరాలు గురువారం రాత్రి నీట మునిగాయి. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వెళ్లే రహదారి షేక్‌పేట వంతెన ఆరంభంలో నీళ్లు నిలిచిపోయాయి. అలాగే ఉస్మానియా కాలనీలోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి వరద నీటిని తొలగించే పనులను పర్యవేక్షించారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు.. అర్ధరాత్రి 12.30 గంటల వరకూ అక్కడే ఉండి.. వరదతోపాటు.. ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చూశారు.