అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | అక్రమ నగదు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎదురుదెబ్బ తగిలింది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న సమయంలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. న్యాయ వ్యవస్థపై అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా(CJI Sanjeev Khanna).. వర్మ వ్యవహారంపై అంతర్గత విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేపట్టిన ముగ్గురు న్యాయమూర్తుల బృందం నగదు వ్యవహారాన్ని నిగ్గుతేల్చింది. జస్టిస్ వర్మ(Justice Verma)ను తొలగించాలని సూచించింది. దీంతో అప్పటి సీజేఐ ఖన్నా ఆయనను రాజీనామా చేయాలని కోరగా, వర్మ నిరాకరించారు. దీంతో అతడ్ని తొలగించాలని సీజేఐ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు..
Supreme Court | పార్లమెంట్‌లో అభిశంసన
సుప్రీంకోర్టు సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం(Central Government) పార్లమెంట్‌లో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు కమిటీ నివేదికను చెల్లనిదిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్రపతి. ప్రధానమంత్రికి పంపిన సిఫార్సును కూడా ఆయన సుప్రీం సవాలు చేశారు.
Supreme Court | కొట్టేసిన కోర్టు..
అయితే, వర్మ పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) తాజాగా కొట్టేసింది. “సీజేఐతో పాటు అంతర్గత కమిటీ ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయడం తప్ప మిగతా ప్రక్రియను జాగ్రత్తగా అనుసరించాయి. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే మీరు సవాల్ చేయాల్సింది.” అని సుప్రీంకోర్టు పేర్కొంది. “సీజేఐ ప్రధానమంత్రి(Prime Minister), రాష్ట్రపతి(President)కి లేఖ పంపడం రాజ్యాంగ విరుద్ధం కాదు. భవిష్యత్తులో అవసరమైతే విచారణలను లేవనెత్తడానికి మేము దానిని తెరిచి ఉంచిన కొన్ని పరిశీలనలను మేము చేశాము” అని జస్టిస్ ఏజీ మేషి, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం తెలిపింది.