అక్షరటుడే, వెబ్‌డెస్క్: America | దాదాపు మూడు సంవత్సరాలుగా కోమాలో ఉన్న ఓ మహిళ, ఆర్గాన్ డోనేషన్ సర్జరీ (Organ Donation Surgery) జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ అరుదైన సంఘటన అమెరికాలో (America) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
న్యూ మెక్సికోకు చెందిన 38 ఏళ్ల డానెల్లా గల్లెగోస్ అనే మహిళ 2022లో తీవ్ర అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆశలు కోల్పోయి, మళ్లీ సాధారణ స్థితికి రావడం అసాధ్యమని కుటుంబసభ్యులకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో న్యూమెక్సికోలోని ఒక ఆర్గాన్ డోనేషన్ సర్వీస్ సంస్థ (Organ Donation Service Organization), ఆమె అవయవాలను దానం చేయాలని కుటుంబాన్ని కోరింది. వారు మొదట అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ, ఆఖరికి డాక్టర్ల మాటలు నమ్మి ఆర్గాన్ డొనేషన్‌కు అనుమతి ఇచ్చారు.
America | దేవుని వరం..
అయితే సర్జరీ జరుగుతున్న సమయంలో, అకస్మాత్తుగా డానెల్లా కళ్లు తెరచింది. ఇది చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే సర్జరీని నిలిపివేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, ఇక్కడ మరో వివాదం తలెత్తింది. డానెల్లా కళ్ల దగ్గర గాట్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు గమనించారని చెబుతున్నారు. దీనిపై డాక్టర్లను ప్రశ్నించగా.. వారు “ఇది కత్తి గాటు కాదు. నీటి తడిగా ఏర్పడిన ప్రతిబింబం మాత్రమే అని సమాధానమిచ్చారు. డానెల్లా సోదరి మాత్రం ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. డాక్టర్లు తాము చెప్పిన సూచనలను నిర్లక్ష్యం చేశారనీ, ఆమె చేతిని పట్టుకున్నప్పుడు కదలికలు గమనించినప్పటికీ సర్జరీ చేపట్టారని ఆరోపించారు.
అయితే వైద్యులు ఈ ఆరోపణలను ఖండించారు. డానెల్లాకు ఏ విధమైన హానీ జరగకుండా సర్జరీని ఆపింది డొనేషన్ సర్వీస్ టీమ్ (Donation Service Team) అని పేర్కొన్నారు. మొత్తంగా ఈ సంఘటన విజ్ఞాన శాస్త్రానికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా కోమా నుంచి కోలుకోవడం అత్యంత అరుదైన సందర్భాలలో ఒకటిగా భావించబడుతోంది. డానెల్లా ప్రాణాలు కోల్పోతుందనుకున్న సమయంలో ఆమెకు జీవం తిరిగి రావడం… కుటుంబానికి దేవుని వరంగా అనిపిస్తోంది.