అక్షరటుడే, వెబ్‌డెస్క్:KCR | పదిహేనేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపిన నాయకుడు.. పదేండ్ల పాటు ప్రభుత్వాన్ని ఏలిన పాలకుడు.. పాతికేళ్లుగా తెలంగాణ(Telangana)పై చెరగని ముద్ర వేసి, చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కేసీఆర్(KCR).. స్వరాష్ట్ర సమరంలో ఆ మూడు అక్షరాలపేరు ఓ బ్రాండ్‌గా ముద్ర పడింది. తను పిలుపిస్తే యావత్ తెలంగాణ కదిలింది. తన రాజకీయ ఎత్తులు, వ్యూహాలతో తెలంగాణను సాధనలో కేసీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిగా ప్రజలు గులాబీ బాస్(Pink Boss)కు రెండుసార్లు అవకాశమిచ్చారు. ముఖ్యమంత్రి పీఠం మీదకు ఎక్కించారు. చివరకు పదేండ్ల పాలనపై విసుగెత్తి మొన్న కాంగ్రెస్(Congress)కు పట్టం కట్టారు. ఓటమిని ఒప్పుకుని సగౌరవంగా తప్పుకోవాల్సిన కేసీఆర్ అలా చేయలేదు. ఇప్పటికీ ప్రజల నిర్ణయాన్ని ఆమోదించలేదు. వాళ్ల ఖర్మ అంటూ రాష్ట్రాన్ని వదిలేసి ఫామ్‌హౌస్(Farmhouse)కు పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన నాయకుడు.. పద్దెనిమిది నెలలుగా పత్తా లేకుండా పోయారు. ఇప్పటికీ ఓటమిని అంగీరించకుండా ఇంకా జనాల్నే తప్పుబడుతున్నారు.
KCR | ఉత్తుంగ తరంగం కేసీఆర్..
విమర్శకుల ప్రకారం పదవీ రాలేదన్న స్వార్థమో.. ఇంకేదో కానీ కేసీఆర్(KCR) సరైన సమయంలో తెలంగాణ సెంటిమెంట్(Telangana Sentiment)ను రగిలించారు. గులాబీ జెండా ఎత్తి ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించారు. అన్ని వర్గాలను కదిలించారు. పార్టీలకతీతకంగా ఒక్కటి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ తెలంగాణ ప్రకంపనలు సృష్టించారు. పదిహేనేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను, వెన్నుపోట్లను చూశారు. అయినా ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో జనాల్లో ఉంటూనే రాష్ట్ర విభజన అనివార్యమైన పరిస్థితులను సృష్టించారు. యావత్ తెలంగాణను ఏకం చేయడం, దేశవ్యాప్తంగా 33 పార్టీల మద్దతు కూడగట్టడమంటే మామూలు విషయం కాదు. ఆంధ్ర పాలకుల ఆర్థిక బలం, రాజకీయ ఆధిపత్యాన్ని ఓడించి చివరకు స్వరాష్ట్రాన్ని సాధించడంలో గులాబీ బాస్ వ్యూహాలు కీలకంగా వ్యవహరించాయి.
KCR | పదేళ్ల పాలన..
వందలాది మంది యువకుల ఆత్మబలిదానం(Self-sacrifice).. లక్షలాది మంది పోరాటం మూలంగా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణను తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్‌కు ఖ్యాతి దక్కింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ప్రజలకు ఆయనకు పట్టం కట్టారు. గద్దెనెక్కిన గులాబీ బాస్(Pink Boss) అనేక సంస్కరణలకు, సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. తొలి ఐదేండ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారు. ఈ క్రమంలోనే రాజకీయ పునరేకీకరణ అంటూ వలసలను ప్రోత్సహించారు. 2018 ఎన్నికల్లో జనం రెండోసారి కూడా ఆశీర్వదించారు. ఆ తర్వాతే కేసీఆర్(KCR)లో మార్పు మొదలైంది. ప్రతిపక్షాలను లేకుండా చేసి ప్రశ్నించే గొంతుకలను లేకుండా చేశారు. ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు సామంత రాజులుగా నియమించారు. తొలి ఐదేళ్ల పాటు ఎంత బాగా పాలించారో, తర్వాతి ఐదేళ్లలో అంత దారుణంగా ప్రవర్తించారు. దీంతో విసిగి పోయిన ప్రజలు అవకాశం కోసం చూశారు. మొన్నటి ఎన్నికల్లో ఊహించని రీతిలో దెబ్బ కొట్టారు.
KCR | ఓటమిని అంగీకరించని నాయకుడు..
ఎన్నికల ఫలితాల తర్వాత ఏ నాయకుడైనా మీడియా(Media) ముందుకు వచ్చి ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని స్వచ్ఛందంగా, సగౌరవంగా తప్పుకుంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పని చేస్తామని చెబుతారు. కానీ కేసీఆర్(KCR) అలా కాదు. పీఏతో రాజీనామా పంపించేసి, కారెక్కి ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు. ఒకటి, రెండు సార్లు తప్ప బయటకు రాలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కోసం పని చేయాల్సిన వ్యక్తి గడప దాటలేదు. ప్రభుత్వం(Government)పై పోరాడాల్సిన నాయకుడు పెదవి తెరవలేదు.
KCR | తప్పంతా ప్రజలదేనట..
బీఆర్ఎస్(BRS) ఓడిపోయి ఏడాదిన్నర దాటింది. ఇప్పటికీ కేసీఆర్ తీరులో మార్పు కరువైంది. జనం నిర్ణయాన్ని అంగీకరించాలన్న సోయి లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి నిన్నటి రజతోత్సవ సభ(Silver Jubilee) వరకు కేసీఆర్ సహా ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా తమ ఓటమిని ఒప్పుకోవడం లేదు. పైగా ప్రజలదే తప్పు అని నిందిస్తున్నారు. అటు ఉద్యమ సమయంలో, ఇటు ప్రభుత్వ పాలనలో కలిపి మొత్తంగా పాతికేళ్లు నెత్తిన పెట్టుకున్న ప్రజలనే తప్పుబడుతున్నారు. మొన్న జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు సందర్భంగానైనా జనం నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ చెబుతారేమో అని అందరూ చూశారు. కానీ అది కేసీఆర్(KCR) కదా. తన వ్యక్తిత్వమే అంత కదా. ఎన్నికల సమయంలోనే గెలిపిస్తే పాలిస్తా. లేకపోతే ఫామ్ హౌస్‌లోనే ఉంటా అని బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఆయన. సుదీర్ఘ కాలం తర్వాత మొన్న బయటకు వచ్చిన గులాబీ బాస్ వ్యాఖ్యల్లో అదే పోకడ ధ్వనించింది. దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పితుకుతానంటే ఎలా అంటూ ప్రజా తీర్పును అపహాస్యం చేసే రీతిలో ఆయన ప్రసంగం సాగింది. ఆధిపత్య పోకడను, దొరస్వామ్యాన్ని జనం ఛీత్కరించినా ఇప్పటికీ మారలేదు. ఇకనైనా మారకపోతే మళ్లీ పరాభవం తప్పదు.