India-England Test
India-England Test | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీపై మొదటి అడుగులోనే వివాదం.. లెజెండ్స్ గైర్హాజరుపై దుమారం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-England Test | భారత్ – ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ సంబంధాలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఇప్పుడు తొలి సిరీస్ నుంచే వివాదంలో చిక్కుకుంది.

ఈ ట్రోఫీని (Trophy) అందించాల్సిన వేళ, దీనికి పేరులుగా నిలిచిన సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), జేమ్స్ అండర్సన్ (James Anderson) ఇద్దరూ ప్రదానోత్సవానికి గైర్హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. ఫలితంగా సోషల్ మీడియాలో అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న‌టి టివరకు భారత్ – ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌లకు (IND VS ENG Test series) పటౌడీ ట్రోఫీ (భారత్‌లో), ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ (ఇంగ్లండ్‌లో) లాంటి ట్రోఫీలను అందించేవారు. అయితే, ఇప్పుడు ఈ రెండింటి స్థానంలో ‘అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ’ ఏర్పాటైంది.

India-England Test | ఆదిలోనే వివాదం..

సిరీస్ ప్రారంభానికి ముందు లండన్‌లో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ వేడుకకు సచిన్, అండర్సన్ ఇద్దరూ హాజరయ్యారు. ట్రోఫీలో తమ పేర్లు పెట్టడాన్ని గౌరవంగా భావించినట్లు చెప్పారు. అండర్సన్ అయితే, “సచిన్ వంటి దిగ్గజంతో నా పేరు పెట్టడం కొంచెం అసౌకర్యంగా ఉన్నా, ఇది గర్వకారణం” అని అభిప్రాయపడ్డాడు.అయితే, సిరీస్ ముగింపులో విజేత జట్టుకు ట్రోఫీ అందించాల్సిన కార్యక్రమానికి వీరిద్దరూ రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అంశంపై బీసీసీఐ (BCCI) లేదా ఈసీబీ (ECB) నుంచి ఎటువంటి ఆధికారిక స్పష్టత రాకపోవడంతో వివాదం ముదిరింది. కారణాలపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.షెడ్యూల్ సమస్యనా, వ్యక్తిగత కారణాలా, లేకుంటే నిర్వాహక లోపమా, ముందస్తు సమాచారం లేకపోవడమా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు.

క్రికెట్ అభిమానులు మాత్రం ఈ వ్యవహారాన్ని నిర్వాహకుల వైఫల్యంగా భావిస్తూ.. “దిగ్గజాలను గౌరవించని విధానం ఇది” అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. తమ పేర్లతో ఏర్పాటు చేసిన ట్రోఫీకి కూడా వీరిని ఆహ్వానించకపోవడం చాలా బాధాకరం, టెండూల్కర్, అండర్సన్ లాంటి లెజెండ్స్ గైర్హాజరు ఈ ట్రోఫీకి మచ్చగా మారుతుంది. ఇది క్రికెట్ చరిత్రలో ఒక చేదు ఉదంతం కావొచ్చు అని అంటున్నారు. బీసీసీఐ లేదా ఈసీబీ నుండి ఈ వివాదంపై ఓ స్పష్టత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా, ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ తక్కువ పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. ఈ క్రమంలో 21 ఏళ్ల రికార్డ్‌ను టీమిండియా తిరిగరాసింది. సోమవారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్‌.. 367 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) (5/104) ఐదు వికెట్లతో భారత్‌కు చిరస్మరణీయమైన వియాజయాన్నందించ‌గా, ప్రసిధ్ కృష్ణ(4/126) నాలుగు వికెట్లు తీసాడు. ఆకాష్ దీప్ ఓ వికెట్ పడగొట్టడంతో పాటు బ్యాటింగ్‌లోను స‌త్తా చాటాడు.