అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Congress | సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి (Kondal Reddy) రాక అంశం కామారెడ్డి కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయన కామారెడ్డికి రానున్నారన్న సమాచారం ఆ పార్టీ నేతల్లో గందరగోళానికి తెరతీసింది. ఆదివారం ‘అక్షరటుడే’లో (Akshara Today) ప్రచురితమైన ‘కామారెడ్డిలో కొండల్ రెడ్డి పాగా!’ కథనం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందని చర్చించుకుంటున్నారు.
కామారెడ్డి నియోజకవర్గ (Kamareddy constituency) కాంగ్రెస్‌లో విబేధాలు తారాస్థాయికి చేరాయన్న ప్రచారం జరిగింది. సొంత పార్టీ నేతల మధ్య విబేధాలు రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో పార్టీ నాయకులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం సోదరుడు కొండల్ రెడ్డి (CM brother Kondal Reddy) నేరుగా రంగంలోకి దిగుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఆయన కామారెడ్డిలో మకాం వేసి ఇక్కడి నేతల పనితీరును పరిశీలించనున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో ఇక్కడ షబ్బీర్ అలీ ఉండగా కొండల్ రెడ్డి రావాల్సిన అవసరం ఏముందన్న చర్చ ప్రస్తుతం పార్టీలో సాగుతున్నట్లు తెలిసింది.
Kamareddy Congress | కటౌట్ల దుమారం
కామారెడ్డి పట్టణంలో ప్రధాన కూడళ్లలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఆయన సోదరుడు కొండల్ రెడ్డి నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేయడం ఇప్పుడు పార్టీలో దుమారం రేపుతోంది. ఈ కటౌట్లు ఎవరు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారో తెలియక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. స్థానిక నేతల ఫొటోలు లేకుండానే ఏర్పాటు చేయడం వెనక బలమైన కారణం ఉండే ఉంటుందని నాయకులు గుసగుసలాడుతున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి షబ్బీర్ అలీ (constituency in-charge Shabbir Ali) ఫొటో లేకుండా కటౌట్లు పెట్టడంతో ఆయన అనుచరులు అయోమయానికి గురవుతున్నారు.
Kamareddy Congress | నేతల మధ్య సఖ్యత కోసమేనా..?
నియోజకవర్గంలో ముఖ్య నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం, నేరుగా పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదులు వెళ్లడంపై అధిష్టానం (high command) సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. నేతల మధ్య వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారడంతో దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లోపు వర్గపోరు, గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేలా కొండల్ రెడ్డిని కామారెడ్డికి పంపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన కామారెడ్డిలోనే మకాం వేసి నాయకుల మధ్య విబేధాలు లేకుండా చేస్తారన్న ప్రచారం సాగుతోంది.