అక్షర టుడే, బోధన్: Nizamabad Collector | రెంజల్ మండలంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి (Collector T Vinay Krishna Reddy) సోమవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. ముందుగా వీరన్నగుట్ట జెడ్పీహైస్కూల్‌తో పాటు ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని (anganwadi center) సందర్శించారు. ఈ సందర్భంగా బోధన, బోధనేతర సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ విధానంలో హాజరు పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన, వసతులపై అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల, కిచెన్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం (mid-day meal) అందించాలని హెచ్‌ఎంలను ఆదేశించారు. అనంతరం పీహెచ్‌సీ, ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంలోనూ టీచర్ లేకపోవడంతో చర్యలు తీసుకోవాలని సీడీపీవోను ఫోన్‌లో ఆదేశించారు. అలాగే సహకార సంఘం ఎరువుల గోడౌన్‌లో ఎరువుల నిల్వలు పరిశీలించారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో (MPDO office) సంబంధిత అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, తదితర ఇంజనీరింగ్ విభాగాల ఏఈల క్షేత్రస్థాయి సందర్శనల వివరాలను ఎంపీడీవో కార్యాలయంలో మూవ్‌మెంట్ రిజిస్టర్ నిర్వహించాలని, జిల్లాలోని అన్ని మండలాల్లో దీన్ని అమలుపర్చాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య చర్యలు పక్కాగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై గ్రామం వారీగా సమీక్ష జరిపారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు.