అక్షరటుడే, కామారెడ్డి: South Campus | తెయూ సౌత్ క్యాంపస్‌లో అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) రిజిస్ట్రార్ యాదగిరి (Registrar Yadagiri) తెలిపారు. సౌత్ క్యాంపస్ హాస్టల్ గదిలో ఆదివారం రాత్రి అశ్విని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. ఘటనపై విద్యార్థులు సోమవారం క్యాంపస్ ముందు మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. అంబులెన్స్ సరిగా లేకపోవడం వల్లే అశ్విని మృతి చెందిందని ఆరోపించారు.
వీపీ వచ్చి క్యాంపస్‌లో వసతులపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. వీసీ అందుబాటులో లేరని, రిజిస్ట్రార్‌తో మాట్లాడించారు. రిజిస్ట్రార్ క్యాంపస్‌కు వచ్చి పరిస్థితులను తెలుసుకోవాలని విద్యార్థులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు, క్యాంపస్ అధికారులు రిజిస్ట్రార్‌తో మాట్లాడారు. ఈమేరకు రిజిస్ట్రార్ యాదగిరి క్యాంపస్‌కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు.
South Campus | విద్యార్థిని మృతి బాధాకరం
పీజీ విద్యార్థిని అశ్విని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెయూ రిజిస్ట్రార్ యాదగిరి అన్నారు. భవిష్యత్‌లో మంచిస్థానంలో ఉండాల్సిన విద్యార్థులు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. క్యాంపస్‌లో అంబులెన్స్ ఏర్పాటు చేయడం కోసం వీసీతో మాట్లాడతానన్నారు. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. క్యాంపస్‌లో మెడిసిన్ అందుబాటులో ఉంచుతామని, తాత్కాలికంగా వైద్యుడిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అశ్విని మృతి విషయంలో క్యాంపస్ సిబ్బంది తప్పిదం ఉంటే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.