అక్షరటుడే, భీమ్‌గల్: MLA Prashanth Reddy | వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో సాగునీటికి విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) కోరారు. ఈ మేరకు సోమవారం ట్రాన్స్‌కో ఎస్ఈ రవీందర్‌తో (Transco SE Ravinder) ఫోన్లో మాట్లాడారు. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వెంటనే గ్రామంలో విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన ఎస్ఈని కోరారు.
MLA Prashanth Reddy | మూడురోజులుగా అరకొర విద్యుత్ సరాఫరా
మూడు రోజుల క్రితం గ్రామంలో పంటలకు అసలు కరెంట్ ఇవ్వలేదని రైతులు (Farmers) ఆరోపించారు. గత రెండురోజులుగా ఆరు గంటల చొప్పున విద్యుత్ ఇస్తున్నారని.. దీంతో పంటలకు నీళ్లు సరిగ్గా అందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయే స్థితిలో ఉందని రైతులు ఎమ్మెల్యేకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతులందరూ సబ్‌స్టేషన్‌కు వెళ్లి అధికారులను అడిగితే లోఓల్టేజ్ సమస్య(Low Voltage Problem) ఉందని.. 3 కెపాసిటర్ సెల్స్, నాలుగు బ్యాటరీలు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఎస్ఈకి ఫోన్ చేశారు. వెంటనే మెటీరియల్ సప్లయ్ చేసి కరెంట్ సమస్య త్వరితగతిన పరిష్కరించి రైతులకు కరెంట్ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.