అక్షరటుడే, వెబ్డెస్క్: Putrada Ekadashi | హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడిన రోజు. ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణుమూర్తి(Vishnumurthy)ని పూజించడం వల్ల శుభాలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. ఏకాదశి తిథులు ప్రతి తెలుగు నెలలో రెండుంటాయి. ఇందులో శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. దీనిని పుత్రదా ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి, లక్ష్మీవల్లభుడిని పూజించే దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని భవిష్య పురాణం చెబుతోంది. మంగళవారం పుత్రదా ఏకాదశి.. ఈ నేపథ్యంలో పుత్రదా ఏకాదశి(Putrada Ekadashi) విశిష్టత గురించి తెలుసుకుందామా..
పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవారు. ఆయన పాలనలో ప్రజలకు ఏ లోటూ ఉండేది కాదు వారంతా సిరిసంపదలతో సుభిక్షంగా ఉండేవారు. అయితే రాజు గారికి మాత్రం సంతానం లేకపోవడం వల్ల విచారంతో ఉండేవారు. సంతానం కోసం మహిజిత్తు చేయని యాగం లేదు, తిరగని పుణ్యక్షేత్రం లేదు. రాజుకు సంతానం లేకపోవడంతో ప్రజలు సైతం బాధపపడేవారు. ఓ రోజు ఆ రాజ్యానికి దగ్గరలో లోమశుడు అనే మహర్షి ఉన్నాడని తెలుసుకుని ప్రజలు అక్కడికి వెళ్లి రాజు సమస్యను చెప్పారు. రాజుకు సంతానభాగ్యం కలిగే దారి చెప్పమని అర్థించారు. నిష్కామంతో ఆ ప్రజలు అడుగుతున్న కోరికకు సంతసించిన లోమశుడు.. శ్రావణ మాసం(Shravana Masam)లో మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే రాజుకు సంతానం కలుగుతుందని చెప్పారు. దీంతో రాజ దంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలంతా ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే రాజుగారికి సంతానం కలిగింది. అప్పటి నుంచి ఈ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పిలుస్తున్నారు.
Putrada Ekadashi | ఏకాదశిన ఏం చేయాలంటే..
పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు దశమినాడు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. ఆ రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉండాలి. తులసి దళాలతో ఆ శ్రీమన్నారాయణుడిని పూజించాలి. విష్ణు సహస్రనామం(Vishnu Sahasranamam), నారాయణ కవచం వంటి స్తోత్రాలను పారాయణ చేయాలి. భగవంతుడి కీర్తనలతో, భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగారం ఉండాలి. మరుసటి రోజు ద్వాదశి తిథిన ఉదయం తల స్నానం చేసి ఇంట్లో యథావిధిగా పూజ ముగించుకుని సమీపంలోని ఆలయానికి వెళ్లి విష్ణు దర్శనం చేయాలి. ఇంటికి వచ్చి ఒక సద్భ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలందించాలి. అనంతరం ఉపవాసాన్ని విరమించాలి. నిష్టతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారికి సంతాన భాగ్యం(Santhana Bhagyam) కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. సంతానం కలగాలని కోరుకునే వారే కాకుండా తమ పిల్లలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.