అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌లో (Dharna Chowk) నిరాహార దీక్ష ప్రారంభించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తూ 72 గంటల దీక్ష చేపట్టారు. అంతకుముందు ఆమె అంబేడ్కర్, పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దీక్ష సందర్భంగా 72 గంటల పాటు తాను నీళ్లు కూడా తీసుకోనని తెలిపారు.
MLC Kavitha | బీసీల ఆత్మగౌరవ పోరాటం
జనాభాలో సగం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు (BC Reservations) అంతమేర ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవ పోరాటం అని ఆమె అన్నారు. దీక్షకు తనకు 72 గంటల పాటు అనుమతి ఇవ్వాలని కోరారు. నీరు కూడా తీసుకోకుండా చేపడతానని పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లిన, ఇంటికి పంపినా దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
MLC Kavitha | బీసీలకు రాజకీయ ప్రాధాన్యం దక్కాలి
జనాభాలో సగం ఉన్న బీసీలకు రాజకీయాల్లో సగ భాగం ప్రాధాన్యం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టి కేంద్రంపై ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) బీసీలపై ప్రేమ ఉంటే.. ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను సీఎం నివృత్తి చేయాలన్నారు. ముస్లింలకు కాకుండా బీసీలకే 42శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించాలన్నారు.
MLC Kavitha | ప్రభుత్వం భయపడుతోంది
తాము దీక్షలు చేస్తామంటే ప్రభుత్వం భయపడుతోందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. 72 గంటల దీక్షకు పర్మిషన్ అడిగితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే దీక్షలకు అనుమతి ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. సమైఖ్యాంధ్ర పాలకులు కూడా దీక్షకు పర్మిషన్ ఇచ్చారన్నారు. తమకు 72 గంటల దీక్షకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమతి కోసం ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశామన్నారు.