అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. నగరం విస్తరిస్తుండడంతో పాటు జనాభా పెరుగుతుండటంతో వాహనాలు సైతం పెరిగాయి. దీంతో నిత్యం ట్రాఫిక్‌లో నగరవాసులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ట్రాఫిక్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) అనేక చర్యలు చేపడుతోంది.
ఇప్పటికే పలు మార్గాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టింది. మెట్రో రైలుతో ఎంతో మంది వేగంగా గమ్యస్థానాలకు వెళ్లగలుగుతున్నారు. దీంతో ప్రభుత్వం మెట్రో రెండో దశ నిర్మాణానికి సైతం చర్యలు చేపట్టింది. ఇటీవల కొండాపూర్ –గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించిన విషయం తెలిసిందే. మరికొన్ని ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో భాగంగా ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించాలని నిర్ణయించింది.
Hyderabad | రూ.650 కోట్లతో..
నగర శివారులోని ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు రూ.650 ఎలివేటేడ్ కారిడార్ (డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్) నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఫ్లై ఓవర్ నిర్మించనున్న ప్రాంతాన్ని సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, పెద్ద అంబర్పేట్ వరకు, ఓఆర్ఆర్ మీదుగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు తెలిపారు. హయత్ నగర్ రేడియో స్టేషన్ నుంచి వనస్థలిపురం వరకు సుమారు 6 కి.మీ మెట్రో రైలు(Metro Train) మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరతామన్నారు.
Hyderabad | వేగంగా గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు
రాష్ట్రంలోని గౌరెల్లి, వలిగొండ, భద్రాచలం మార్గంలో రూ.2,300 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే (Greenfield Highway) మంజూరైందని మంత్రి తెలిపారు. ఆ హైవే పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఆందోల్ మైసమ్మ నుంచి విజయవాడ వరకు రూ.375 కోట్లతో రోడ్డు నిర్మాణం సైతం వేగంగా చేపడుతున్నట్లు వివరించారు.
Hyderabad | మెట్రో రెండో దశ పూర్తి చేస్తాం
నగరంలో మెట్రో ప్రాజెక్ట్‌ను గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే రెండో దశ పనుల కోసం శ్రీకారం చుట్టామన్నారు. రెండో దశ అనుమతులకు సంబంధించిన బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉంచారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఉప్పల్ – నారపల్లి ఫ్లైఓవర్‌ను నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.