అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Film Chamber | అసలే సినీ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా నుంచి చిత్ర పరిశ్రమ కష్టాలలో కొట్టుమిట్టాడుతోంది. అదే సమయంలో వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు సినిమా షూటింగ్స్ బంద్‌కు (Film shootings Bandh) పిలుపునివ్వడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. సినీ వర్కర్లకు 30 శాతం వేతనాలు పెంచాలని చిత్ర పరిశ్రమకు చెందిన ఫెడరేషన్‌లోని 24 కార్మిక సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆదివారం రోజు వర్కర్స్ ఫెడరేషన్ (Workers Federation) సభ్యులు.. ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరపగా, ఆ చర్చలు విఫలం కావడంతో సినిమా షూటింగ్స్ బంద్‌కు పిలుపునిచ్చారు.
Film Chamber | ఖండిస్తున్నాం..
ఫెడరేషన్ బంద్ నిర్ణయాన్ని ఫిలిం ఛాంబర్ (Film Chamber) ఖండించింది. పక్షపాతంగా 30 శాతం వేతనాల పెంపును డిమాండ్ చేస్తున్నట్లు ఫిలిం చాంబర్ పేర్కొంది. ఇప్పటికే సినీ పరిశ్రమల్లో (Film Industry) నైపుణ్యం ఉన్నవారికి, లేని వారికి కనీస వేతనాల కంటే ఎక్కువగా జీతాలు చెల్లిస్తున్నట్లు పేర్కొంది. బంద్ నిర్ణయంతో నిర్మాణంలో ఉన్న సినిమాలకు భారీ నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఛాంబర్ సంబంధింత అధికారులతో చర్చలు జరుపుతోందని తెలిపింది.
‘‘నిర్మాతలు (Producers) ఎలాంటి స్వతంత్ర చర్యలు లేదా సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా ఛాంబర్ జారీ చేసే దిశా నిర్దేశాలను ఖచ్చితంగా అనుసరించాలని తెలియజేస్తున్నాం. శాశ్వత పరిష్కారం, మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి” అంటూ ఫిలిం ఛాంబర్ లేఖలో పేర్కొంది. దీంతో ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో అని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో బేబి చిత్ర నిర్మాత ఎస్కేఎన్ (Baby Movie Producer SKN) తన పోస్ట్‌లో ‘ఇప్పటికే ఆడియన్స్ థియేటర్లకు దూరం, ఇప్పుడు అదనపు వేతనాల భారం, ఓటీటీ శాటిలైట్స్ అగమ్యగోచరం, పైరసీ పుండుమీద కారం, పేరుకే వినోద పరిశ్రమ నిర్మాతల శ్రమ విషాదమే’ అని పోస్ట్ చేయడం చర్చనీయాంశం అయింది.