Chain Snatching
Chain Snatching | ఎంపీ మెడలో నుంచి చైన్​ లాక్కెళ్లిన దొంగ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Chain Snatching | దేశవ్యాప్తంగా చైన్​ స్నాచర్లు (Chain Snatchers) రెచ్చిపోతున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. బైక్​పై వచ్చి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. కొంత మంది యువత జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం చైన్​ స్నాచింగ్​లకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంతో మందిని అరెస్ట్​ చేస్తున్నా.. గొలుసు దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ దొంగ ఏకంగా ఎంపీ మెడలో నుంచే చైన్​ లాక్కెళ్లాడు.

ఢిల్లీలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో తన బంగారు గొలుసును లాక్కెళ్లారని కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ (Congress MP Sudha Ramakrishnan) సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని మైలదుత్తురై ఎంపీ అయిన రామకృష్ణన్ ప్రస్తుతం పార్లమెంట్​ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మార్నింగ్​ వాక్​కు (Morning Walk) వెళ్లిన సమయంలో ఆమె చైన్​ను దొంగలు లాక్కొని పారిపోయారు. దీంతో ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెల్మెట్​ ధరించి బైక్​పై వచ్చిన వ్యక్తి తన చైన్​ లాక్కొని పారిపోయాడని చెప్పారు. ఆ సమయంలో తనతో పాటు డీఎంకేకు చెందిన ఎంపీ రాజతి (MP Rajathi) ఉన్నట్లు తెలిపారు.

Chain Snatching | మెడపై గాయాలు

తాము వాకింగ్​ చేస్తుండగా.. ఎదురుగా బైక్​పై వచ్చిన వ్యక్తి చైన్​ లాక్కొని పారిపోయాడని ఎంపీ సుధా రామకృష్ణన్ తెలిపారు. సదరు వ్యక్తి గొలుసును గట్టిగా లాగడంతో మెడపై గాయాలు అయినట్లు చెప్పారు. అనంతరం ఢిల్లీ పోలీసులకు (Delhi Police) ఫిర్యాదు చేశామన్నారు. ఈ మేరకు ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు (Union Home Minister Amit Shah) లేఖ రాశారు. నిందితుడిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.