Kaleshwaram Commission
Kaleshwaram Commission | కాళేశ్వ‌రం నివేదికపై ముగిసిన అధ్య‌యనం.. నేడు కేబినెట్‌లో చ‌ర్చించ‌నున్న మంత్రులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Commission | జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ (Justice PC Ghosh Commission) ఇచ్చిన నివేదిక‌పై అధికారుల క‌మిటీ అధ్య‌య‌నం ముగిసింది. సుమారు 700 పేజీల నివేదిక‌లోని సారాంశాన్ని క్లుప్తంగా నోట్ రూపంలో త‌యారు చేసింది. అధికారుల క‌మిటీ రూపొందించిన ఈ నోట్‌పై సోమ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రుగ‌నున్న మంత్రిమండ‌లిలో చ‌ర్చ జ‌రుగ‌నుంది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram project) నిర్మాణంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ ఇటీవ‌ల ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే. 700 పేజీల నివేదిక‌లోని ముఖ్య‌మైన ప్రాధాన్య‌త‌ల‌తో కూడిన సారాంశాన్ని క్లుప్తంగా రూపొందించ‌డానికి గాను రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారుల క‌మిటీని నియ‌మించింది. సాధారణ పరిపాలన, న్యాయ, సాగునీటి పారుదల శాఖల ముఖ్యకార్యదర్శులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

Kaleshwaram Commission | క్లుప్తంగా నివేదిక‌..

ప్ర‌భుత్వ ఆదేశాల‌తో ఆయా శాఖ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శులతో కూడిన క‌మిటీ రంగంలోకి దిగింది. గ‌త రెండ్రోజులుగా క‌మిష‌న్ నివేదిక‌ను క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసిన అధికారుల క‌మిటీ.. కీల‌కాంశాల‌తో కేబినెట్‌నోట్‌ను రూపొందించింది. ప్రాజెక్టులో జ‌రిగిన అక్ర‌మాలు, ఎవ‌రెవ‌రి పాత్ర ఎంత‌, ఆర్థిక వ్య‌వ‌హారాల్లో జ‌రిగిన త‌ప్పులు వంటి వాటితో క్లుప్తంగా నివేదిక‌ను త‌యారు చేసింది. నీటిపారుదల శాఖ (Irrigation Department) ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్ రూపొందించిన ఈ నివేదిక‌పై మ‌ధ్యాహ్నం జ‌రుగ‌నున్న కేబినెట్‌లో సుదీర్ఘంగా చ‌ర్చించ‌నున్నారు.

Kaleshwaram Commission | సుదీర్ఘ విచార‌ణ‌..

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం (BRS government) రూ.ల‌క్ష కోట్ల‌కు పైగా వెచ్చించి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు మూడేండ్ల‌కు బీట‌లు వారింది. కాళేశ్వ‌రంలో ప్ర‌ధాన‌మైన మేడిగ‌డ్డ బ‌రాజ్‌లోని పిల్ల‌ర్లకు ప‌గుళ్లు వ‌చ్చాయ‌. అలాగే, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల వ‌ద్ద సీకెంట్ ఫైల్స్ కొట్టుకుపోయాయి. దీంతో ఈ ప్రాజెక్టు మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో కాళేశ్వరం నిర్మాణంలో జ‌రిగిన అక్ర‌మాల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress government) విచార‌ణ‌కు ఆదేశించింది. జ‌స్టిస్ పీసీ హోష్ క‌మిష‌న్ ను ఏర్పాటు చేసింది. దీంతో సుదీర్ఘంగా విచారించిన క‌మిష‌న్ ఇటీవ‌లే ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించింది. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో పేర్కొంది. కేసీఆర్‌, హరీశ్‌రావు, ఈటల పాత్రతో పాటు నాడు జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌న్నింటినీ పూస‌గుచ్చిన‌ట్లు తెలిపింది.

Kaleshwaram Commission | కేబినెట్ భేటీపైనే అంద‌రి దృష్టి..

కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పటి సీఎం కేసీఆర్‌ (KCR), మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), ఈటల పాత్రల గురించి వివరించిన కమిషన్‌.. అధికారుల ప్రమేయం, వారు నిర్వర్తించిన పాత్రల గురించి కూడా వివరించింది. బాధ్యులందరిపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేయాలని కమిషన్ సూచించినట్లు తెలిసింది. క‌మిష‌న్ నివేదిక‌ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. కాళేశ్వరం క‌మిష‌న్ నివేదిక‌పై (Kaleshwaram Commission report) చ‌ర్చించడ‌మే ఎజెండాగా మంత్రివర్గం సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది.

మంత్రిమండ‌లి స‌మావేశంలో ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌న్న దానిపై ఉత్కంఠ నెల‌కొంది. అధికారుల క‌మిటీ ఇచ్చే నివేదిక‌పై చ‌ర్చించ‌నున్న మంత్రివ‌ర్గం.. ప్ర‌త్యేక విచార‌ణ బృందాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో నివేదిక‌పై చ‌ర్చించ‌డానికి అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాలు కూడా ఏర్పాటు చేసే అవ‌కాశ‌ముంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కేసీఆర్‌, హ‌రీశ్, ఈట‌ల స‌హా మిగ‌తా వారిపై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుద‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.