ABHA Cards
ABHA Cards | రాష్ట్రంలో వేగంగా డిజిటల్​ హెల్త్​కార్డుల జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : ABHA Cards | రాష్ట్రంలో డిజిటల్​ హెల్త్​ కార్డుల (Health Cards) జారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(అభా) కార్యక్రమం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా తెలంగాణలో ఇప్పటి వరకు 2.50 కోట్ల మంది డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకున్నారు. ఇందులో 68 లక్షల మంది తమ ఆరోగ్య రిపోర్టులను అభా కార్డులతో అనుసంధానం చేశారు. జులైలో 2.36 లక్షల మంది తమ హెల్త్ రికార్డులను డిజిటల్​ కార్డుతో లింక్ చేసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం (Central Govt) దేశవ్యాప్తంగా ఆయుష్మాన్​ భారత్​ (Ayushman Bharat) డిజిటల్ మిషన్​ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ పేషెంట్లకు అభా ఐడీ ఐడీ తప్పనిసరి నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

ABHA Cards | ఎలా పొందాలంటే

ఆధార్​ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా అభా కార్డును తీసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభా ఐడీని సిబ్బంది జనరేట్ చేసి ఇస్తారు. లేదంటే ప్రజలే నేరుగా abdm.gov.in వెబ్​సైట్లో దరఖాస్తు చేసుకొని కార్డు పొందొచ్చు. 14 నంబర్​ యూనిక్​ నంబర్​తో ఈ కార్డు ఇస్తారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్​ కాలేజీ అనుబంధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే రిపోర్టులను ఈ కార్డుతో లింక్​ చేస్తారు.

ABHA Cards | ఆరోగ్య వివరాలు ఆన్​లైన్​లో..

అభా కార్డుతో ప్రజలు ఆరోగ్య వివరాలు డిజిటలైజ్​ చేస్తారు. ఆరోగ్య సమస్యలు, ల్యాబ్ రిపోర్టులు, మందుల వివరాలు వంటి మెడికల్ రికార్డులను ఆన్​లైన్​ చేస్తారు. రోగికి సంబంధించిన చరిత్ర మొత్తం ఈ కార్డులో ఉంటుంది. ఒక్కసారి అకౌంట్​ ఓపెన్ చేస్తే రోగికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి.

ABHA Cards | తప్పనున్న ఓపీ తిప్పలు

ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ కోసం చాలా సేపు నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే అభా కార్డు ఉంటే ఆ తిప్పలు తప్పనున్నాయి. లైన్​లో వేచి ఉండకుండానే అభా యాప్‌‌‌‌‌‌‌‌ను మొబైల్‌‌‌‌‌‌‌‌లో డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకొని, ఆసుపత్రిలోని క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌ను స్కాన్ చేసి ఓపీ టోకెన్​ పొందవచ్చు.

ABHA Cards | గ్రామీణ ప్రాంతాల్లో నెమ్మదిగా..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభా కార్డుల జారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. హైదరాబాద్ (Hyderabad) జిల్లాలో ఇప్పటి వరకు 35.8 లక్షల అభా కార్డులు జారీ చేశారు. రంగారెడ్డి (35.3 లక్షలు) రెండో స్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అభాకార్డులు పొందుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేక ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.