- Advertisement -
HomeUncategorizedAmerica | ర‌ష్యా యుద్ధానికి భార‌త్ ప‌రోక్ష సాయం.. మ‌రోసారి అక్క‌సు వెల్ల‌గ‌క్కిన అమెరికా

America | ర‌ష్యా యుద్ధానికి భార‌త్ ప‌రోక్ష సాయం.. మ‌రోసారి అక్క‌సు వెల్ల‌గ‌క్కిన అమెరికా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | భార‌త్‌, ర‌ష్యా సంబంధాల‌పై అమెరికా గుర్రుగా ఉంది. మాస్కో నుంచి సైనిక ఉత్ప‌త్తులు, చ‌మురు కొనుగోలు చేయ‌డాన్ని ఆక్షేపిస్తున్న అగ్ర‌రాజ్యం(America).. తాజాగా ర‌ష్యా చేస్తున్న యుద్ధానికి భార‌త్ ప‌రోక్షంగా సాయం చేస్తోంద‌ని ఆరోపించింది. రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి భారతదేశం పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సీనియర్ సహాయకుడు స్టీఫెన్ మిల్లర్(Stephen Miller) ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాలని ట్రంప్ గట్టిగా చెప్పారని మిల్లర్ అన్నారు.మాస్కోతో వాణిజ్యాన్ని నిలిపివేయాలని న్యూఢిల్లీపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ పరిపాలన తీవ్ర ప్రయత్నాల మధ్య ఈ ప్రకటన రావ‌డం గ‌మ‌నార్హం.

America | ఆమోదయోగ్యం కాదు

వైట్ హౌస్(White House) డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ట్రంప్‌కు అత్యంత ప్రభావవంతమైన సహాయకులలో ఒకరైన స్టీఫెన్ మిల్లర్ ఫాక్స్ న్యూస్ “సండే మార్నింగ్ ఫ్యూచర్స్”(Sunday Morning Futures) కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపాలని ట్రంప్ స్పష్టంగా చెబుతున్నార‌న్నారు. “రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఇండియా మాస్కో-కీవ్ యుద్ధానికి నిధులు సమకూర్చుతున్న‌ది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన (ట్రంప్) చాలా స్పష్టంగా చెప్పారు.. రష్యా చమురు కొనుగోలులో ఇండియా చైనాతో పోటీ ప‌డుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని” మిల్లర్ తెలిపారు. ట్రంప్ ఇండియాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi)తో కూడా అద్భుతమైన సంబంధాన్ని కోరుకుంటున్నారని ఆయ‌న చెప్పారు. కానీ ఈ యుద్ధానికి ఆర్థిక సహాయం చేయడం గురించి వాస్తవికంగా వ్యవహరించాలని, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆప‌డానికి దౌత్యపరంగా, ఆర్థికంగా, ఇతరత్రా వ్యవహరించడానికి అన్ని ఎంపికలు ఉన్నాయని, తద్వారా మనం శాంతిని సాధించగలమని అధ్యక్షుడు ట్రంప్ న‌మ్ముతున్నార‌ని తెలిపారు.

- Advertisement -

America | వెన‌క్కి త‌గ్గ‌ని ఇండియా..

అమెరికా ఎన్ని ర‌కాలుగా ఒత్తిళ్లు చేస్తున్నా ఇండియా(India) వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. సుంకాల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తోంది. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపబోమని ఇండియా ఇప్ప‌టికే స్పష్టం చేసింది. దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి రష్యా (Russia) చమురు సేకరణ కొన‌సాగుతుంద‌ని తేల్చి చెప్పింది. ఇండియాకు ర‌ష్యాతో ద‌శాబ్దాలుగా కొన‌సాగిస్తున్న‌ స‌న్నిహిత సంబంధాల‌ను తెంచుకోవాల‌ని ట్రంప్ ఆశిస్తున్నారు. కానీ, అత్యంత నమ్మ‌క‌మైన మిత్రుడ్ని దూరం చేసుకునేందుకు భార‌త్ సిద్ధంగా లేదు. ఈ నేప‌థ్యంలోనే ట్రంప్ సుంకాలు విధించారు. రష్యాతో కొనసాగుతున్న రక్షణ, ఇంధన లావాదేవీలను గుర్తు చేస్తూ భారతీయ వస్తువులపై 25% సుంకాన్ని పెంచుతున్న జూలై 30న ప్ర‌క‌టించారు. భారత్, రష్యాలను డెడ్ ఎకానమీస్(Dead Economies) అని ఆరోపించారు. భారత్ రష్యాతో ఏం చేసినా పట్టించుకోనని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మాస్కో శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే, రష్యన్ చమురు కొనుగోలును కొనసాగించే ఏ దేశం పైన అయినా 100 శాతానికి సుంకాలను పెంచుతామని కూడా ట్రంప్ బెదిరించారు. అయిన‌ప్పటికీ ఇండియా మాత్రం ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తూనే ఉంది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తామని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News