అక్షరటుడే, హైదరాబాద్: LRS : ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు నేటి (ఏప్రిల్ 30)తో దరఖాస్తు ముగియనుంది. ఇకపై గడువును పెంచబోమని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. దీంతో నేటితో చివరిరోజు కావడంతో అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది.
లేఅవుట్లు, పంచాయతీ పరిధిలోని ఖాళీ స్థలాలు, నగర, పురపాలక స్థలాలను క్రమబద్ధీకరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీతో అవకాశం ఇచ్చింది. కానీ, స్థల యజమానులకు అప్లై చేసినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.
లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులకు రూ.25 వేల నుంచి రూ.లక్షల్లో ఫీజు ఉంటోంది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు యజమాని ముందుకు వస్తున్నా.. సదరు అర్జీలకు రకరకాల కొర్రీలు చూపుతుండటంతో అవస్థలు తప్పడం లేదు.
అభ్యంతరాలను పరిష్కరించుకోవడానికి కొందరు రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీల చుట్టూ తిరుగుతున్నారు. అయినా, వెబ్సైట్లో ఏదో ఒక కారణంతో దరఖాస్తులు ఆ అధికారులకే తిరిగి వస్తుండటంతో టౌన్ ప్లానింగ్ అధికారులు బేజారెత్తిపోతున్నారు.