అక్షరటుడే, కామారెడ్డి : South Campus : కామారెడ్డి జిల్లా (Kamareddy District) భిక్కనూరులో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) సౌత్ క్యాంపస్లో దారుణం చోటుచేసుకుంది. పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన అశ్విని (24) తెలంగాణ యునివర్సిటీ సౌత్ క్యాంపస్ లో పీజీ తెలుగు విభాగం 2 వ సంవత్సరం చదువుతోంది. కాగా, ఆదివారం రాత్రి 7:30 ప్రాంతంలో తన గదిలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటన సౌత్ క్యాంపస్ లో కలకలం రేపింది. తోటి విద్యార్థులు ఈ విషయాన్ని వెంటనే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్యాంపస్ కు చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) కి తరలించారు. విద్యార్థిని అశ్విని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రిన్సిపల్ సహా విద్యార్థుల ద్వారా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.