Kamareddy | కామారెడ్డిలో కొండల్ రెడ్డి పాగా..!
Kamareddy | కామారెడ్డిలో కొండల్ రెడ్డి పాగా..!

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : కామారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా కామారెడ్డి నియోజకవర్గంలో కొత్త నాయకత్వం రానున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ(Congress party)లో ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా సమాచారం.

దీనికి ఊతం ఇస్తూ కామారెడ్డిలో సీఎం సోదరుడి భారీ కటౌట్ ఏర్పాటు కావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్​తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేశారు.

ఇక్కడ సారథ్యం వహిస్తున్న షబ్బీర్ అలీ(Shabbir Ali) నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయగా రెండు చోట్లా ఇద్దరు కూడా ఓటమి పాలయ్యారు. కామారెడ్డి ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ప్రత్యేక దృష్టి పెట్టారు. నాడు తన సోదరుడు కొండల్ రెడ్డిని నేరుగా రంగంలోకి దింపారు. దీంతో ఆయన కామారెడ్డిలోనే మకాం వేసి ప్రచార బాధ్యతలను స్వయంగా చేపట్టారు.

కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయినా కొద్దిరోజుల పాటు కామారెడ్డిలో సీఎం సోదరుడు కొండల్ రెడ్డి హవా కొనసాగింది. తర్వాత క్రమంగా ఆయన కామారెడ్డికి దూరమయ్యారు. నిజామాబాద్ అర్బన్ తో పాటు కామారెడ్డి బాధ్యతలు కూడా షబ్బీర్ అలీ చూస్తూ వస్తున్నారు.

Kamareddy : కటౌట్ల ఏర్పాటుతో చర్చ

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఏడాదిన్నర కాలంలో ఎప్పుడు కూడా కామారెడ్డిలో సీఎం సోదరుడి కటౌట్లు ఏర్పాటు చేయలేదు. తాజాగా ఆదివారం కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి.

ప్రస్తుతం ఈ కటౌట్ కామారెడ్డి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక నాయకుల ఫొటోలు ఎక్కడా ఏర్పాటు చేయకుండా సీఎం సోదరుల ఫొటోలతో కటౌట్ ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది.

Kamareddy : స్థానిక ఎన్నికల నేపథ్యంలో..

త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలో ఇటీవల కామారెడ్డిలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడి నేతల మధ్య సఖ్యత కొరవడిందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి. పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీలో నెలకొన్న నేతల మధ్య వివాదాన్ని చక్కదిద్దే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే తన సోదరుడు కొండల్ రెడ్డి(Kondal Reddy)ని నేరుగా రంగంలోకి దింపుతున్నారన్న ప్రచారం సాగుతోంది.

ఆ ప్రచారానికి నిదర్శనమే ఆదివారం పట్టణంలో వెలిసిన కటౌట్ అని సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా రక్షాబంధన్, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల పేరుతో కటౌట్ వెలువడం కామారెడ్డి రాజకీయాల్లో హాట్ టాపిక్​గా మారింది.