Kamareddy SP
Kamareddy SP | పగలు ఐస్​క్రీంలు అమ్ముతూ.. రాత్రిళ్లు చోరీలు చేస్తూ..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పగలంతా ఐస్ క్రీములు అమ్మి రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు అంతర్రాష్ట దొంగల ముఠాను (Robbery gang) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మైనర్ కూడా ఉండడం గమనార్హం. జిల్లా పోలీసు కార్యాలయంలో (Police Office) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) వివరాలను వెల్లడించారు.

గతనెల 25న భిక్కనూరు (Bhiknoor) మండలం అంతంపల్లి (Anthampally) గ్రామ శివారులో రెడీమిక్స్ కంపెనీలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వాచ్​మెన్లను బెదిరించి మొబైళ్లు, 11వేల విలువ చేసే ఐరన్ రాడ్లను అపహరించారు. అలాగే 27న రాజంపేట మండలం తలమడ్ల శివారులో ఉన్న జెన్ అడ్సార్ప్షన్స్​ (ZEN ADSORPTIONS) కంపెనీలో చొరబడిన దుండగులు రూ.15 లక్షల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ రెండు కేసుల్లో పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు.

భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద ఒకరిని, కామారెడ్డిలో(Kamareddy) నలుగురిని హైదరాబాద్​లో (Hyderabad) ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో దొంగిలించిన సొత్తును హైదరాబాద్ ముషీరాబాద్​లో (MusheeraBad) విక్రయిస్తారని తేలింది. గతంలో వీరిపై ఆరు కేసులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తానే అలీ, బిర్ధేష్ అలీ, సల్మాన్, మహమ్మద్ సమీర్, ఓ మైనర్​ ముఠాగా ఏర్పడి కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ, ఆదర్శ నగర్ కాలనీల్లో నివాసం ఉంటున్నారు.

వీరు చోరీ చేసిన వస్తువులను ముషీరాబాద్​​ చేర్చడానికి ఆ ప్రాంతానికి చెందిన హాసన్ ఖాన్ అనే వ్యక్తి వాహనాన్ని సమకూరుస్తాడు. ఆ వాహనంలో ముషీరాబాద్​ తీసుకెళ్లిన వస్తువులను పది నిమిషాల్లో పార్ట్​లుగా విడదీసి ఇతర చోటకు తరలిస్తారని ఎస్పీ తెలిపారు. వీరిపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో నాలుగు కేసులు ఉన్నాయని వివరించారు.

వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్, ఒక ATFE కండన్సర్, 1 SPDU, 20 లీటర్ల ట్యాంకులు 3, రెండు రాడ్లు, ఒక బెల్ట్ గార్డ్, ఒక FFE, ఒక తర్మసిఫాన్ పాట్, ఒక పైప్​లైన్ (వీటి విలువ రూ.15 లక్షలు), 390 మీటర్ల సోలార్ ప్లాంట్ కాపర్ వైరు, 15 వేల విలువ చేసే సెంట్రింగ్ బాక్సులు, 2.25, 7.5, 2 హెచ్​పీ మోటార్లు, ఒక బైకు, చోరీ చేసేందుకు ఉపయోగించిన బైక్​, 3 మొబైళ్లు, ఐరన్ రాడ్డు, టాటా ఏస్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో కామారెడ్డి సబ్​డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీసీఎస్ పోలీసులు పాల్గొన్నారు.