అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కాలం చెల్లిన మందులను ఉపయోగించవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) వైద్యులకు సూచించారు. ఆయన కామారెడ్డి మండలం క్యాసంపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని (Ayushman Health Center) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో రక్త పరీక్షల గదిని పరిశీలించి అవసరమైన వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు కచ్చితంగా చేయాలన్నారు.
డ్రగ్ స్టోర్‌ను పరిశీలించి వర్షాకాలంలో (rainy season) అధికంగా ఉపయోగపడే జ్వరం, విరేచనాలు, దగ్గు, జలుబు తదితర వ్యాధుల మందులు ఎలప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. కాలం చెల్లిన మందులను ఉపయోగించరాదని ఆదేశించారు. వ్యాక్సినేషన్ గదిని పరిశీలించి గర్భిణులు, చిన్నారులకు నిర్ణీత సమయాల్లో వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు. రోజు ఎంతమంది అవుట్ పేషంట్లు ఈ ఆస్పత్రికి వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులు (seasonal diseases) ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విధులపై అలసత్వం, అశ్రద్ధ వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి చంద్రశేఖర్‌ను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన ఇంకుడు గుంతను పరిశీలించారు. గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడకుండా క్రమం తప్పకుండా పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ఇన్‌ఛార్జి పంచాయతీ సెక్రెటరీని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రభు కిరణ్, దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జోహా ముజీబ్, క్యాసంపల్లి ఉప ఆరోగ్య కేంద్రం వైద్యురాలు మీనాక్షి దేవి ఉన్నారు.