అక్షరటుడే, కామారెడ్డి: Nizamsagar project | నిజాంసాగర్ జలాశయం ఎకో టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. కలెక్టరేట్లోని (Collectorate) తన ఛాంబర్లో శనివారం టూరిజం కార్పొరేషన్ (Tourism Corporation) అధికారులతో సమావేశం నిర్వహించారు. జలాశయం వద్ద ఎకో టూరిజం (Ecotourism) అభివృద్ధికి రూ.9.98 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
Nizamsagar project | స్వదేశ్ దర్శన్‌లో భాగంగా..
స్వదేశ్ దర్శన్ (Swadesh Darshan) కార్యక్రమంలో భాగంగా టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ తెలిపారు. జలాశయం వద్ద ఇప్పటికే 12.30 ఎకరాల భూమిని ఎకో టూరిజం అభివృద్ధికి సేకరించినట్లు పేర్కొన్నారు. గుర్తించిన స్థలంలో వెంటనే భూమి చదును చేయడం, పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టాలన్నారు.
పనులు త్వరగా పూర్తి చేసి ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా డీలక్స్ రూములు, సూట్ రూములు, స్పా, యోగా సెంటర్, రెస్టారెంట్, డార్మెటరీ, మెయిన్ ఎంట్రెన్స్ ఆర్చ్, థీమ్ గార్డెన్తో పాటు చిన్న పిల్లల ఆటస్థలం నిర్మాణాల కోసం శంకుస్థాపనకు సిద్ధం చేయాలని టూరిజం కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డీఈ విద్యాసాగర్, ఏఈ సోహెల్, జిల్లా టూరిజం అధికారి జగన్నాథం పాల్గొన్నారు.