అక్షరటుడే, భీమ్‌గల్: Turmeric Research Center | కమ్మర్‌పల్లిలో (Kamamrpally) పసుపు పరిశోధన కేంద్రం (Turmeric Research Center) కోసం ఎన్నో పోరాటాలు చేశామని రైతు నాయకుడు కోటపాటి నరసింహానాయుడు పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పరిశోధన కేంద్రాన్ని శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని 2007లో ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిజామాబాద్, కరీంనగర్ రైతులతో ధర్నా నిర్వహించి అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరత్ పవర్‌ను కలిసి విన్నవించామన్నారు.
దీంతో శరత్‌పవార్ వెంటనే స్పందించి అప్పటి హైదరాబాద్‌లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (NG Ranga Agricultural University) వైస్ ఛాన్స్‌లర్‌తో మాట్లాడి పసుపు పరిశోధన కేంద్రం మంజూరు చేయాల్సిందిగా ఆదేశించారని వివరించారు. అనంతరం కమ్మర్‌పల్లిలో 36 ఎకరాల్లో ఏర్పాటు చేయబడిందని, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం (Konda Laxman Bapuji Horticulture University) ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తోందన్నారు.
Turmeric Research Center | 350 ఎకరాల్లో..
దాదాపు 350 ఎకరాల్లో పసుపు రకాలను పండిస్తూ రైతులకు ప్రయోజన కరమైన రీతిలో అధిక కర్కుమిన్ రకాలను సాగు చేస్తున్నారని కోటపాటి వివరించారు. పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బోర్లకుంట మహేందర్, టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్లు కోటపాటికి సాగు పద్ధతులు, పరిశోధన ఫలితాలను వివరించారు. ఈ ఏడాది వందలాది మంది రైతులకు అధిక కర్కుమిన్, అధిక దిగుబడి ఇచ్చి వంగడాలను పంపిణీ చేసినట్లుగా వివరించారు.
తాము పోరాడి సాధించుకున్న పరిశోధనా కేంద్రం సమర్థవంతంగా పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడి శాస్త్రవేత్తలు, సిబ్బందిని అభినందించారు. పరిశోధన కేంద్రాన్ని పసుపు రైతులు తరచుగా సంప్రదించి పరిశోధనా ఫలితాలను అంది పుచ్చుకోవాలని సూచించారు. ఆయన వెంట కొక్కుల విద్యాసాగర్, రుక్మాజీ లున్నారు.