అక్షరటుడే, ఇందల్వాయి: Indian Army | తన కుమారుడు సైన్యంలో చేరి దేశసేవలో ఉన్నాడని నలుగురికీ గర్వంగా చెప్పుకుంది ఆ తల్లి.. కానీ విధి మాత్రం అనారోగ్యం రూపంలో జవాన్‌ను కబలించింది. దీంతో తన కుమారుడి జ్ఞాపకార్థం నలుగురి సాయంతో విగ్రహాన్ని తయారుచేయించి ఆ మాతృమూర్తి ఆవిష్కరించింది. వివరాల్లోకి వెళ్తే..
అమరవీరుడు ఆర్మీ జవాన్ (Army jawan) చెవుల ప్రశాంత్ యాదవ్ (Chevula Prashanth yadaw) విగ్రహాన్ని ఆయన మాతృమూర్తి నర్సవ్వ శనివారం ఆవిష్కరించారు. ఇందల్వాయి (Indalwai) మండలంలోని చంద్రాయన్ పల్లి (Chandrayan Pally) గ్రామానికి చెందిన ప్రశాంత్ యాదవ్ సైన్యంలో చేరి తొమ్మిదేళ్లు దేశానికి సేవలందించాడు. 2023 ఆగస్టు 28న విధుల్లో ఉండగానే అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి భార్య ఒక కుమారుడు ఉన్నారు.
చంద్రాయన్ పల్లి గ్రామపంచాయతీ ఆవరణలో జవాన్ కుటుంసభ్యులు, ఆర్మీ జవాన్లు, గ్రామపెద్దల సహకారంతో ప్రశాంత్ యాదవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం విగ్రహాన్ని ఆయన తల్లి ఆవిష్కరించారు. విగ్రహవిష్కరణ సందర్భంగా ప్రశాంత్‌యాదవ్ విగ్రహానికి ఆయన కుమారుడు పాలాభిషేకం చేశాడు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సమయంలో ప్రశాంత్ తల్లి, భార్య కన్నీళ్లు పెట్టుకోవడంతో గ్రామస్థులు ఓదార్చారు. ప్రశాంత్ సోదరుడు ప్రవీణ్ మాట్లాడుతూ దేశసేవ కోసం ఆర్మీలో చేరిన తన అన్న ప్రశాంత్ యాదవ్ బ్రెయిన్ ట్యూమర్‌తో విధుల్లో ఉండగానే మరణించాడని.. దేశసేవలో ఆయన అమరుడవ్వడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, ఆర్మీ జవాన్లు సంతోష్, ప్రశాంత్, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జవాన్ ప్రశాంత్ యాదవ్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న ఆయన సతీమణి, కుమారుడు
జవాన్ ప్రశాంత్‌యాదవ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న చంద్రాయన్ పల్లి గ్రామస్థులు