IND vs ENG
IND vs ENG | ప్రసిధ్ కృష్ణ - జో రూట్ మధ్య మాటల తూటాలు.. కేఎల్​ రాహుల్ అసహనం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఐదో టెస్ట్‌లో టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(England batsman Joe Root) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మైదానంలో వీరిద్దరి మధ్య చిన్న‌పాటి ఘర్షణతోపాటు వాగ్వాదం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తొలి ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్ సమయంలో క్రీజులోకి కొత్తగా వచ్చిన జో రూట్ ప్రసిధ్ వేసిన బంతిని వదిలేశాడు. వెంటనే ప్రసిధ్ అతని దగ్గరకు వెళ్లి ఏదో వ్యాఖ్య చేశాడు. దీనికి రూట్ కూడా బదులిచ్చాడు. ఆ తర్వాత బంతిని బౌండరీకి తరలించిన జో రూట్, ప్రసిధ్‌ను చూసి ఏదో అన్నాడు.

IND vs ENG | మాట‌ల తూటాలు..

ఇద్దరి మధ్య మాటల తూటాలు ప్రారంభమైన వేళ ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన ప్రసిధ్ కృష్ణను (Prasidh Krishna) మందలించగా, భారత ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (Kl Rahul) దీనిపై అసహనం వ్యక్తం చేశాడు. కేవలం ప్రసిధ్‌ను మందలించడంపై అభ్యంతరం చెబుతూ, ఇరువురి త‌ప్పు ఉందని అంపైర్‌ను నిలదీశాడు. ఇది మాత్రమే కాదు, అంతకుముందు ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్‌ను ఔట్ చేసిన టీమిండియా పేసర్ ఆకాష్ దీప్(Team India pacer Akash Deep), అతని భుజంపై చేతులు వేసి సెండాఫ్ ఇచ్చిన ఘటన కూడా ఉద్రిక్తతను పెంచింది. ఈ సిరీస్ ప్రారంభం నుంచే ఇరు జట్ల మధ్య వేడి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జో రూట్‌తో జరిగిన మాటల యుద్ధం తర్వాత ప్రసిధ్ మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను గడగడలాడించాడు. మొత్తం నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.

సిరాజ్ కూడా నాలుగు వికెట్ల‌తో ఇంగ్లండ్ న‌డ్డి విరిచాడు. ఈ క్ర‌మంలో ఆతిథ్య జట్టు 247 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 23 పరుగుల లీడ్ మాత్రమే ద‌క్కింది . ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) 51 పరుగలు, ఆకాష్​ దీప్​ నాలుగు పరుగులతో క్రీజ్​లో ఉన్నారు. జైస్వాల్ క్రీజులో నిలదొక్కుకుంటే.. మూడో రోజు మొదటి గంటన్నరలో టీమిండియా స్ట్రాంగ్ పొజీష‌న్‌లో ఉంటుంది. జైస్వాల్‌తో పాటు క్రీజులో ఉన్న ఆకాశ్ దీప్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొని, మన లీడ్‌ను పెంచితే భార‌త్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ని స‌మం చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.