అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs ENG | గెలవాలంటే నిలవాల్సిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. తొలి రోజు వర్షం కారణంగా మధ్య వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. మ్యాచ్‌లో కరుణ్ నాయర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో జట్టుని ఆదుకోగా.. అతనికి జోడీగా వాషింగ్టన్ సుందర్(Washington Sundar)(19 బ్యాటింగ్) అండగా నిలిచాడు. అయితే ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలు పెట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ పేసర్ల అద్భుత ప్రదర్శనతో ఓవల్ టెస్ట్‌లో భారత్ రెండో రోజు కేవలం 20 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కూడా చేజార్చుకుంది.
IND vs ENG | బౌలింగ్‌తో అదరగొట్టేశారు..
రెండో రోజు ఆరంభం నుంచి ఇంగ్లండ్ బౌలర్లు(England Bowlers) దాడికి దిగారు. నైట్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ (57), వాషింగ్టన్ సుందర్ (26) వేగంగా పెవిలియన్ చేరారు. టెయిలెండర్లు ఏ మాత్రం సరైన ప్రతిఘటన చూపలేకపోయారు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ డకౌట్ కావడంతో ఇన్నింగ్స్ కేవలం అరగంట వ్యవధిలో ముగిసిపోయింది. ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్సన్ 33 పరుగులిచ్చి ఐదు కీలక వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. కరుణ్ నాయర్(Karun Nair) కీలకమైన వికెట్‌ను టాంగ్ తీసుకున్నాడు. మరోవైపు.. భారత టెయిలెండర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ అద్భుతమైన బౌలింగ్ ధాటికి టీమిండియా(Team India) నిలవలేకపోయింది. ఇన్నింగ్స్ ముగిసిన తీరుతో మ్యాచ్‌పై ఇంగ్లండ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్ల వికెట్లను వెనువెంటనే కోల్పోయింది. యశస్వి జైస్వాల్(2) వికెట్ త్వరగా కోల్పోగా, కొద్ది సేపటికే కేఎల్ రాహుల్(14) పెవిలియన్ చేరారు. అట్కిన్సన్ బౌలింగ్‌లో జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్‌కి చేరగా.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ కాసేపు వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. లంచ్ విరామం తర్వాత శుభ్‌మన్ గిల్(Shubhman Gill) లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. టీ బ్రేక్ తర్వాత సాయి సుదర్శన్(38)ను జోష్ టంగ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా, ఆ కాసేపటికే రవీంద్ర జడేజా (9) కూడా టంగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక పంత్ స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్(19)ను అట్కిన్సన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మొత్తానికి భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 18 పరుగులు చేసింది. క్రాలీ (12 నాటౌట్), డకెట్( 5 నాటౌట్) క్రీజులో ఉన్నారు.