అక్షరటుడే, వెబ్‌డెస్క్: Scorpion | భూమిపై జీవించే చాలా జీవులు ఆహారం లేకుండా కొంతకాలం బతకగలిగినా, శ్వాస లేకుండా మాత్రం ఎక్కువరోజులు ఉండలేవు. మనుషుల విషయానికి వస్తే, శ్వాస తీసుకోకపోతే కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. కానీ తేలు (Scorpion) మాత్రం కొన్ని అరుదైన లక్షణాలతో ఇతర జీవులకంటే భిన్నంగా ఉంటుంది. తేలు గురించి మనకు ఎక్కువగా తెలిసింది దీని విషపూరిత స్వరూపం మాత్రమే. అయితే దీని సహనశక్తి, జీవించగల సామర్థ్యం విన్నాక మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. తేలు ఆరు రోజులు శ్వాస తీసుకోకుండా జీవించగలదు.
Scorpion | అలా ఎందుకుంటే..
దీనికి కారణం తేలు శ్వాసకోశ వ్యవస్థ ఎంతో ప్రత్యేకంగా ఉండడం. తేలు ఊపిరితిత్తులు “బుక్ లంగ్స్” (Book Lungs) అనే నిర్మాణంలో ఉంటాయి. ఇవి పుస్తకపు పేజీల్లా ముడుచుకొని ఉండడంతో, తేలు వాటిలో గాలిని నిల్వ చేసుకోగలదు. దాంతో, శ్వాస కోసం ఆక్సిజన్ (Oxigen) బయట నుంచి అందకపోయినా, దాని శరీరంలో ఉన్న గాలితోనే కొన్ని రోజులు జీవించగలదు. ఇంతేకాదు, తేలు ఒక సంవత్సరం పాటు ఆహారం లేకుండా కూడా బతుకుతుంది. తక్కువ నీటి వినియోగంతో, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ తేలు సజీవంగా ఉండగలదు. ఎడారులు, అడవులు, రాళ్ల మధ్య, పొడి ప్రదేశాలలో తేలు తనని తాను అనుకూలించుకుంటూ మనుగడ సాగిస్తుంది.
మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే, తేలు చర్మంపై అతినీలాలోహిత కాంతి పడినప్పుడు అది మెరిసిపోతుంది. ఇది శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. మన దేశంలో కనిపించే ఇండియన్ రెడ్ స్కార్పియన్ (Indian Red Scorpion) ప్రపంచంలోని అత్యంత విషపూరిత తేళ్లలో ఒకటి. ఇది కాటు వేసిందంటే 72 గంటలలోపు చికిత్స తీసుకోవడం అత్యంత అవసరం, లేకపోతే అది ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ తేలు భారతదేశంతో పాటు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ (Bangladesh) లాంటి దేశాల్లోనూ కనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే, తేలు ఒక సింపుల్ క్రూర జీవి కాదని, అద్భుతమైన అనుకూలతా సామర్థ్యం కలిగిన జీవి అని చెప్పవచ్చు. తేలు గురించి ఈ విషయాలు తెలుసుకున్న వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.