అక్షరటుడే, వెబ్‌డెస్క్: Solar Power | సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ మరో రికార్డు సాధించింది. ప్రపంచంలో సోలార్ కరెంట్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో జపాన్ను దాటేసి మూడో స్థానానికి చేరింది. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (IRENA) లెక్కల ప్రకారం.. భారతదేశం 1,08,494 GWh సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. జపాన్ను (96,459 GWh) భారత్ దాటేసింది. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి (Energy Minister Pralhad Joshi) ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
Solar Power | కేంద్రం ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారానే విద్యుత్ ఉత్పత్తి (Electricity Generation) ఎక్కువ జరుగుతోంది. థర్మల్ విద్యుత్‌తో కాలుష్యం, ఖర్చు రెండు ఎక్కువ అవుతాయి. దేశంలో బొగ్గు ద్వారానే 45.5 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో సోలార్ యూనిట్లు (Solar Units) నెలకొల్పేందుకు నిబంధనలు సరళీకరించింది. అంతేగాకుండా ఇళ్లు, పొలాల్లో సబ్సిడీపై సౌర విద్యుత్ యూనిట్లు నెలకొల్పేలా ప్రజలను ప్రోత్సహిస్తోంది. దీంతో సౌర విద్యుత్ ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది.
Solar Power | 500 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం
భవిష్యత్‌లో దేశంలో 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ఆ లక్ష్యం చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో జపాన్ను దాటేసి ప్రపంచంలో మూడో సోలార్ విద్యుత్ (Solar Electricity) ఉత్పత్తి దేశంగా అవతరించడం గమనార్హం. పెద్ద ఎత్తున సోలార్ పార్కులు, రూఫ్‌టాప్ సోలార్ విధానాలతో సౌర విద్యుత్ ఉత్పత్తి పెరిగింది.