Fighter Jets
Trump Tarrifs | ట్రంప్ సుంకాలు.. ఫైట‌ర్ జెట్ల డీల్‌కు బ్రేకులు.. F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు భార‌త్ నిరాక‌ర‌ణ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tarrifs | మిత్ర‌దేశ‌మంటూనే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భార‌త్‌పై 25 శాతం టారిఫ్‌లు విధించిన నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక‌, ర‌క్ష‌ణ సంబంధాలు దెబ్బ తినే ప‌రిస్థితి నెల‌కొంది. ఏక‌ప‌క్షంగా సుంకాలు పెంచేసిన‌ త‌రుణంలో రెండు దేశాలపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌న్న ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఈ త‌రుణంలోనే అమెరికా ఆఫ‌ర్ చేసిన అధునాత‌న విమానాల కొనుగోలుకు భార‌త్ నిరాకరించింద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ వెల్ల‌డించింది.

F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను (F-35 Stealth Fighter Jets) కొనుగోలు చేయాలనే అమెరికా ప్రతిపాదనను ఇండియా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ 25 శాతం పన్ను విధించడంతో ఏర్పడిన ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇండియా (India) చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగంగా ఈ నిర్ణ‌యం వెలువ‌డింది.

Trump Tarrifs | టారిఫ్‌ల‌కు వ్య‌తిరేకంగానే..?

అత్యాధునిక‌మైన F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను భార‌త్‌కు విక్ర‌యించేందుకు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌తిపాదించారు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలో ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. వైట్ హౌస్​లో (White House) ఇరువురి మ‌ధ్య జ‌రిగిన స‌మావేశంలో అత్యాధునిక యుద్ధ విమానాలను కొనుగోలు అంశం తెర‌పైకి వ‌చ్చింది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి F-35 కొనుగోళ్ల‌కు ఒప్పందం చేసుకోవాల‌ని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

అయితే, దీనిపై ఇండియా నుంచి ఎలాంటి సుముఖ‌త వ్య‌క్తం కాలేదు. అత్యంత ఖ‌రీదైన ఈ ఫైట‌ర్ జెట్ల‌ను కొనుగోలు చేసేందుకు మొద‌టి నుంచీ ఆస‌క్తి చూప‌లేదు. అదే స‌మ‌యంలో ర‌ష్యా ఆఫ‌ర్ చేసిన స్టెల్త్ ఫైట‌ర్ జెట్ల‌పై దృష్టి సారించింది. దీనిపై గుర్రుగా ఉన్న ట్రంప్.. భార‌త్‌పై 25 శాతం టారిఫ్‌లు (Tarrif) విధించారు. ర‌ష్యా, ఇండియా మ‌ధ్య ద్వైపాక్షిక‌, ర‌క్ష‌ణ, వ్యాపార సంబంధాల‌ను ఆయ‌న తీవ్రంగా ఆక్షేపించారు.

Trump Tarrifs | ఆచితూచి..

అయితే, అమెరికా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం (Central Government) ఆచితూచి స్పందిస్తోంది. ప్ర‌తీకార సుంకాలు ఉండ‌వ‌ని తెలిపింది. సుంకాల పెంపు వ‌ల్ల క‌లిగే ఇబ్బందుల‌ను అధిగ‌మించడంతో పాటు అమెరికాకు తగిన విధంగా బ‌దులివ్వాల‌ని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు నిరాకరించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆఫ్-ది-షెల్ఫ్ కొనుగోళ్లకు దూరంగా ఉంటున్న భార‌త్.. దేశీయ తయారీ సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇస్తోంది.