Fake Attendance
Fake Attendance | ఫేక్​ అటెండెన్స్​తో పంచాయతీ కార్యదర్శుల మోసం.. చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Attendance | గ్రామ పంచాయతీల్లో పాలన వ్యవహారాలను చూసుకోవడంలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర. కార్యదర్శులు సమయానికి గ్రామానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా మంది ఇష్టం వచ్చినప్పుడు జీపీ కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఫేసియల్ రికగ్నిషన్(Facial Recognition)​ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆదేశించింది. మొబైల్​ నుంచి యాప్​ ద్వారా జీపీ కార్యాలయం(GP Office)లో అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది జీపీ కార్యదర్శులు ఫేక్​ అటెండెన్స్(Fake Attendance)​ పెట్టి మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

Fake Attendance | చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశం

కొంతమంది కార్యదర్శులు విధులు నిర్వహించకుండా ఫేక్ అటెండెన్స్​తో జీతాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క(Minister Seethakka) ఆదేశించారు. కార్యదర్శులు తాము పని చేస్తున్న గ్రామం నుంచే మొబైల్  ఫేషియల్  రికగ్నిషన్  యాప్ ద్వారా అటెండెన్స్​ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ఫోన్లను పంచాయతీ కార్మికులకు ఇచ్చి తాము లేకుండానే అటెండెన్స్​ నమోదు చేయిస్తున్నారు.

Fake Attendance | పాస్​పోర్టు ఫొటోలు పెట్టి..

కొంత మంది జీపీ కార్యదర్శులు పంచాయతీ సిబ్బందికి తమ ఫోన్లు, పాస్​పోర్టు సైజ్​ ఫొటోలు ఇచ్చి అటెండెన్స్​ నమోదు చేయిస్తుండటం గమనార్హం. కొందరైతే ఖాళీ కుర్చీలను యాప్​ ఫొటోలు తీసి యాప్​లో పెడుతున్నారు. ఒక్కో జిల్లాలో పదుల కొద్ది ఇలాంటి వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జగిత్యాల జిల్లాలో అయితే ఓ కార్యదర్శి సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఫొటో అప్​లోడ్​ చేయడం గమనార్హం. గతంలో సైతం జీపీఎస్​ ఆధారిత అటెండెన్స్ సిస్టమ్​ ఉండగా.. ఫేక్​ జీపీఎస్​ లోకేషన్ల(Fake GPS Locations)తో కొందరు కార్యదర్శులు మోసాలకు పాల్పడ్డారు. దీంతో ప్రభుత్వం ఫేక్​ రికగ్నిషన్​ యాప్​ తీసుకొచ్చింది. అయినా ఫేక్​ అటెండెన్స్​ పెట్టి విధులకు డుమ్మా కొడుతున్నారు.

Fake Attendance | పట్టించుకోని అధికారులు

పంచాయతీ కార్యదర్శుల విధులను పర్యవేక్షించాల్సిన ఎంపీవోలు, ఎంపీడీవోలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామాలకు తనిఖీలకు వచ్చిన సమయంలో పలువురు ఎంపీవో(MPO)లు, ఎంపీడీవో(MPDO)లు కార్యదర్శుల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తనిఖీకి వచ్చినప్పుడు దావత్​, డబ్బులు ఇస్తే తర్వాత వారు ఏం చేస్తున్నారనే విషయాలను కూడా పట్టించుకోవడం లేదు. ఫేక్​ అటెండెన్స్​పై ప్రభుత్వం సీరియస్​ కావడంతో వారిని సస్పెండ్​ చేయాలని డీపీవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.