అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. సాయంత్రం తర్వాత పలు చోట్ల తేలికపాటి వాన పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెదురుమదురు వర్షాలు పడతాయి.
Weather Updates | దంచికొట్టనున్న వానలు
రాష్ట్రంలో ఆగస్టు 7 వరకు వాతావరణం పొడిగా ఉండనుంది. ఆ తర్వాత భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 7, 8 తేదీల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Weather Updates | జోరుగా వ్యవసాయ పనులు
రాష్ట్రంలో మూడు రోజుల క్రితం వరకు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. బోరుబావుల కింద వరినాట్లు గతంలోనే వేయగా.. వర్షంపై ఆధారపడిన రైతులు (Farmers) ప్రస్తుతం సాగు పనుల్లో బిజీ అయిపోయారు.
Weather Updates | అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల
ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఆ నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. జూరాల, శ్రీశైలం, నాగర్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లు కళకళలాడుతున్నాయి. దీంతో వరద గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు.
మరోవైపు ఎగువన గోదావరిలో నీరు లేక వెలవెలబోతుంది. నాలుగైదు రోజులు కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి కొంత మేర నీరు వచ్చింది. శ్రీరాంసాగర్ నిండితే వరద కాలువ ద్వారా మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్‌లకు నీటిని తరలించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం స్వల్ప ఇన్‌ఫ్లో మాత్రమే నమోదు అవుతోంది. మరోవైపు మంజీర నదిపై గల సింగూరు, నిజాంసాగర్ జలాశయాలకు వరద లేక వెలవెలబోతున్నాయి.