Trump Tariffs
Trump Tariffs | మోతెక్కించిన ట్రంప్.. 70 దేశాల‌పై సుంకాలు పెంచుతూ ఉత్త‌ర్వులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత ప‌ని చేశారు. వివిధ దేశాల‌పై ప‌న్నుల మోత మోగించారు. భార‌త్ స‌హా 70కి పైగా దేశాల‌పై 10 నుంచి 41 శాతం వ‌ర‌కు టారిఫ్‌లు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ట్రంప్ నిర్ణ‌యం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో పాటు ద‌శాబ్దాలుగా వివిధ దేశాల‌తో అమెరికాకు (America) కొన‌సాగుతున్న మైత్రిని దెబ్బ తీస్తుంద‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నప్ప‌టికీ ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌లేదు. వాణిజ్య లోటు కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెబుతూ గురువారం రాత్రి వైట్‌హౌస్‌లో (White House) సుంకాల పుంపు ఉత్త‌ర్వులపై సంత‌కం చేశారు. ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందాల మేరకు కొన్ని దేశాలపై సుంకాల్లో మార్పులు చేసినట్టు వివరించారు. స్విట్జర్లాండ్‌పై 39%, ఇరాక్, సెర్బియాపై 35%, అల్జీరియా, బోస్నియా అండ్ హెర్జిగోవినా, లిబియా, సౌతాఫ్రికాపై 30%, భారత్, బ్రునై, కజకిస్తాన్, మాల్డోవా, ట్యునీషియాపై 25%, బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంల‌పై 20%, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌ల‌పై 19% టారిఫ్‌లు విధిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. మిత్ర‌దేశాలైన ఇజ్రాయిల్‌, జ‌పాన్‌ల‌పైనా వ‌డ్డించారు.

Trump Tariffs | అంద‌రిపైనా బాదుడే..

త‌న‌, ప‌ర భేదం లేకుండా అన్ని దేశాల‌పైనా ట్రంప్ (Donald Trump) ప‌న్నులు వ‌డ్డించారు. యూరోపియ‌న్ యూనియ‌న్‌లోని దేశాల‌పైనా ఆయ‌న సుంకాలు విధించారు. ఇండియాను మిత్ర‌దేశ‌మ‌ని పేర్కొంటూనే 25 శాతం టారిఫ్ ప్ర‌క‌టించారు. ఇక‌, సిరియా, మ‌య‌న్మార్ వంటి దేశాల‌పై 40 శాతానికి పైగా సుంకాలు విధిస్తున్న‌ట్లు తెలిపారు. 68 దేశాలు, 27-సభ్య దేశాల‌ యూరోపియన్ యూనియన్‌ (European Union)కు ప‌న్నులు నిర్ణయించగా, ఆర్డర్‌లో జాబితా చేయని దేశాలపై 10% రేటును బేస్‌లైన్‌గా విధించనున్నారు. కొత్త టారిఫ్స్‌లో భాగంగా భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గ‌తంలో చెప్పిన‌ట్లే కెనడాపై 25 నుంచి 35 శాతానికి టాక్స్ పెంచారు. ఔషధాల అక్రమ దందాపై కెనడా అడ్డుకట్టవేయలేకపోవడం, అమెరికాపై ప్రతికార చర్యలకు దిగడం తదితర కారణాలతో కెనడాపై సుంకాన్ని పెంచినట్టు తెలిపారు.

Trump Tariffs | త‌ప్పించుకున్న మెక్సికో..

అయితే ప‌న్నుల బాదుడు నుంచి మెక్సికోకు ఉపశ‌మ‌నం ల‌భించింది. ట్రంప్, మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో (Mexican President Claudia Sheinbaum) జ‌రిగిన చ‌ర్చ‌ల ఫ‌లితంగా టారిఫ్ అమ‌లు 90 రోజుల‌కు వాయిదా ప‌డింది. అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటైన మెక్సికోతో 90 రోజులలో ఒప్పందం చేసుకోనునున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.

“సుంకాల పెంపు నుంచి మేము తప్పించుకున్నాము. దీర్ఘకాలిక ఒప్పందాన్ని చేసుకోవ‌డానికి మాకు 90 రోజుల గ‌డువు ల‌భించింద‌ని,” అని మెక్సికన్ అధ్య‌క్షురాలు క్లాడియా షీన్‌బామ్ వెల్ల‌డించారు. మ‌రోవైపు టారిఫ్‌ల (Trump Tariffs) పెంపుపై ట్రంప్ మాట్లాడుతూ.. అద్భుతమైన కొన్ని ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. ఒప్పందాల‌పై చ‌ర్చించేందుకు కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ(Canadian Prime Minister Mark Carney) ఫోన్ చేశారని, కానీ తాను మాట్లాడలేదన్నారు.

Trump Tariffs | చైనాతో ఇంకా కుదరని ఒప్పందం

అమెరికా, చైనా (China) మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదర‌లేదు. పూర్తిస్థాయి ఒప్పందానికి కొంత సమయం పడుతుందని, ట్రంప్ ఆమోదముద్ర కూడా వేయాల్సి ఉందని వైట్‌హౌస్ వెల్లడించింది. చైనాపై సుంకాల విధింపునకు అమెరికా ఆగస్టు 12వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈ వారం స్టాక్‌హోం వేదికగా జరిగిన చర్చల్లో చైనా డిమాండ్స్‌ను అమెరికా గట్టిగా వ్యతిరేకించినట్టు సమాచారం. భారత్‌తో  (India) ఏకాభిప్రాయం అంత త్వరగా సాధ్యం కాదని అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వాణిజ్యంతో పాటు అనేక భౌగోళికరాజకీయ అంశాలు ఈ చర్చలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు.