
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YS Jagan | ఓ ప్రతిపక్ష నాయకుడిని చూసి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఎందుకు అంతగా భయపడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను చూసి భయపడుతున్న చంద్రబాబు ఓ బావి చూసుకొని దూకాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు (Nellore)లో గురువారం ఆయన పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి (Former MLA Prasanna Kumar Reddy) ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల టీడీపీ నేతలు ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
YS Jagan | రోడ్లను తవ్వుతున్నారు
తన పర్యటనకు ప్రభుత్వం ఎందుకు అన్ని ఆంక్షలు పెడుతుందని జగన్ ప్రశ్నించారు. తన పర్యటనకు ప్రజలు రాకుండా కూటమి ప్రభుత్వం రోడ్లను కూడా తవ్విందన్నారు. ప్రజలను అడ్డుకోవడానికి రెండు వేల మంది పోలీసులను చంద్రబాబు మోహరించారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు. ఏపీలో ప్రస్తుతం ఎమర్జెన్సీ (Emergency) పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
YS Jagan | ప్రసన్నకుమార్‌ను చంపేవాళ్లు
వైసీపీ నేత ప్రసన్నకుమార్ ఇంటిపై దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. సుమారు 80 మంది వచ్చి ఇంటిపై దాడి చేశారన్నారు. మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారని చెప్పారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్ ఇంట్లో ఉంటే చంపేవాళ్లని ఆయన పేర్కొన్నారు. ఇళ్లపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. విమర్శలకు ప్రతివిమర్శలు సాధారణం కానీ, ఇళ్లపై దాడులుచేసి మనుషులను చంపేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
YS Jagan | కేసులు పెట్టి వేధిస్తున్నారు
కూటమి ప్రభుత్వం దాడులు, కేసులతో వైసీపీ నాయకులను వేధిస్తోందని జగన్ ఆరోపించారు. ఇదే మాదిరిగా తమ వాళ్లూ దాడులు చేస్తే బాగుంటుందా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు రోజా, విడదల రజనీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై బూతులు మాట్లాడుతుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 64 రోజులు మాజీ మంత్రిని జైల్లో పెట్టారని, కాకాణిపై 14 కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ పేర్కొన్నారు.