
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Speaker Prasad Kumar | ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించాకే స్పందిస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Speaker Prasad Kumar) వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం గురువారం తనను కలిసిన విలేకరులతో స్పీకర్ మాట్లాడారు.
తీర్పు గురించి తనకు తెలియదని చెప్పారు. తీర్పు కాపీ వచ్చాక, న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. ఈ వ్యవహారంలో దాచేది ఏమీ ఉండదని, అంత బహిరంగమేనని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. తీర్పు కాపీ వచ్చాక తదుపరి ఏం చేయాలనే దానిపై న్యాయ కోవిదులతో చర్చిస్తామన్నారు.
Speaker Prasad Kumar | ధన్‌ఖడ్ వ్యాఖ్యలను గుర్తు చేసిన స్పీకర్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సభాపతి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల లోపు ఏదో ఒక నిర్ణయం వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించింది. దీనిపై సభాపతిని విలేకరులు ప్రశ్నించగా, ఆయన తనదైన శైలిలో స్పందించారు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. న్యాయవ్యవస్థపై ధన్‌ఖడ్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు.
బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై ధన్‌ఖడ్ గతంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. న్యాయస్థానాలు పరిధి దాటి వ్యవహరిస్తున్నాయని, రాజ్యాంగబద్ధ సంస్థలకు కోర్టులు ఆదేశాలు జారీ చేయలేవని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతికి కోర్టులు గడువు విధించవచ్చా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై స్పీకర్ ప్రసాద్‌కుమార్.. ధన్‌ఖడ్ వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలని చెప్పడం ద్వారా ఒకరకంగా కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.